బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారనున్న నేపథ్యంలో ఏపీలో ఐదు జిల్లాలకు అధికారులకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. రానున్న 24 గంటల్లో కోస్తాంధ్రలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది.
శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడలో అతిభారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని తెలిపింది. వాయుగుండం రేపు మధ్యాహ్నానికి విశాఖ – ఒడిశా ల మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది.
విశాఖ, అనకాపల్లి, కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాలకు వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, తూర్పు గోదావరి, ఏలూరు, కృష్ణా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అధికారులు ప్రధాన పోర్టుల్లో మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, నిజాంపట్నం, మచిలీపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ అయ్యాయి.
కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. భారీ వర్షాల నేపత్యంలో నేడు విశాఖ, అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించారు. భారీ వర్షాల నేపథ్యంలో హోంమంత్రి అనిత అప్రమత్తమయ్యారు. ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా చర్యలు చేపట్టేలా నష్టనివారణ చర్యలను పరిశీలిస్తున్నారు.
మరోవైపు తెలంగాణలో అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడ్రోజులు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. భద్రాద్రి, మహబూబాబాద్, ములుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. భూపాలపల్లి జిల్లాకు ఆరెంజ్ అలర్ట్, ఆదిలాబాద్, హనుమకొండ, వరంగల్, కామారెడ్డి, ఖమ్మం, కొమురంభీమ్, నిర్మల్, మంచిర్యాల, సంగారెడ్డి,
మెదక్, వికారాబాద్, సూర్యాపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. భూపాలపల్లి జిల్లాలో అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.
































