ఇండియాలోకి మరొ బుడ్డి ఎలక్ట్రిక్​ కారు- ఎంజీ కామెట్​ ఈవీకి గట్టి పోటీ! రేంజ్​ ఎంతంటే..

విన్​ఫాస్ట్​ నుంచి మరో రెండు ఎలక్ట్రిక్​ కార్లు ఇండియాలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. వాటిల్లో ఒకటి ఎంజీ కామెట్​ ఈవీకి పోటీగా వచ్చే బుడ్డి ఎలక్ట్రిక్​ కారు. ఇంకొకటి 7 సీటర్​ ఈవీ. వివరాల్లోకి వెళితే..

వియత్నాం ఆటోమొబైల్ దిగ్గజం విన్‌ఫాస్ట్.. భారత ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాల మార్కెట్‌లో గణనీయమైన వాటాను దక్కించుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఇప్పటికే వీఎఫ్​6, వీఎఫ్​7 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను విడుదల చేసిన ఈ సంస్థ, ఇప్పుడు మరిన్ని కొత్త ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్లోకి తీసుకురావాలని యోచిస్తోంది. ఈ వ్యూహంలో భాగంగా.. ‘లిమో గ్రీన్’, ‘మినియో గ్రీన్’ అనే రెండు ఎలక్ట్రిక్ కార్లకు భారత్‌లో పేటెంట్ హక్కులను పొందింది. ఆ వివరాలు..


విన్‌ఫాస్ట్ ‘మినియో గ్రీన్’ – ఎంజీ కామెట్ ఈవీకి గట్టి!

విన్‌ఫాస్ట్ ఇప్పటికే ‘మినియో గ్రీన్’ కోసం పేటెంట్ అప్లికేషన్‌ను దాఖలు చేసింది. ఇది ప్రస్తుతం భారతదేశంలోనే అత్యంత చిన్న, అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కారుగా ఉన్న ఎంజీ కామెట్ ఈవీకి గట్టి పోటీనిచ్చే అవకాశం ఉంది. ఈ చిన్న ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ 3,100 మిల్లీమీటర్ల పొడవుతో ఎంజీ కామెట్ కంటే కొద్దిగా పొడవుగా ఉంటుంది. ఇది 2,065 మిల్లీమీటర్ల వీల్‌బేస్‌ను కలిగి ఉంది. 13-ఇంచ్​ టైర్లతో నడుస్తుంది.

విన్‌ఫాస్ట్ ‘మినియో గ్రీన్’ కారు 14.7 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇది 26 బీహెచ్‌పీ పవర్​ని, 65 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు గంటకు 80 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణిస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 170 కిలోమీటర్ల వరకు వెళ్లగలదు. ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ 12కేడబ్ల్యూ ఏసీ ఛార్జర్‌కు అనుకూలంగా ఉంటుంది.

ఈ కారులో ఆల్- ఎల్‌ఈడీ లైట్లు, డ్యూయల్ స్పీకర్లు, 4వే- అడ్జెస్టెబుల్​ డ్రైవర్ సీటు, రెండు డ్రైవ్ మోడ్‌లు, మాన్యువల్ ఏసీ కంట్రోల్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

విన్‌ఫాస్ట్ ‘లిమో గ్రీన్’ – కియా కారెన్స్ క్లావిస్ ఈవీకి పోటీ!

‘లిమో గ్రీన్’ అనే ఏడు సీట్ల ఎలక్ట్రిక్ ఎంపీవీకి సైతం సంస్థ పేటెంట్ అప్లికేషన్ దాఖలు చేసింది. కొన్ని వారాల క్రితం భారతదేశంలో విడుదలైన కియా కారెన్స్ క్లావిస్ ఈవీకి ఇది కీలక పోటీదారుగా మారనుంది. విన్‌ఫాస్ట్ ‘లిమో గ్రీన్’ 4,700 మిల్లీమీటర్ల పొడవు, 1,800 మిల్లీమీటర్ల వెడల్పు, 1,700 మిల్లీమీటర్ల ఎత్తుతో వస్తుంది. దీని వీల్‌బేస్ 2,800 మిల్లీమీటర్లు.

ఈ ఎలక్ట్రిక్ కారు 60.13 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 450 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది. ఇందులో ఉన్న ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ్ 201 బీహెచ్‌పీ గరిష్ట పవర్​ని, 280 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. దీనికి డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది. దీని ద్వారా కేవలం 30 నిమిషాల్లోనే బ్యాటరీని 10 నుంచి 70 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు.

విన్‌ఫాస్ట్ ‘లిమో గ్రీన్’లో ఆల్- ఎల్‌ఈడీ లైట్లు, 18-ఇంచ్​ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. కారు లోపల డ్యూయల్ డ్రైవింగ్ మోడ్‌లు, 6వే- అడ్జెస్టెబుల్​డ్రైవర్ సీటు, ముందు, వెనుక సీట్లకు వెంటిలేషన్, నాలుగు స్పీకర్ల ఆడియో సిస్టమ్, సింగిల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.