ఆంధ్రప్రదేశ్‌ డీఎస్సీ 2025 మెరిట్ జాబితాపై కీలక ప్రకటన

 ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ 2025 స్కోర్ కార్డు విడుదల చేసి వారం రోజులు అవుతోంది. కరెక్షన్స్ కోసం ఇచ్చిన గడువు కూడా ముగిసింది.


ఇప్పుడు ఫైనల్ మెరిట్ జాబితా ఎప్పుడు వస్తుందా అని చాలా ఉద్యోగులు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. పూర్తి స్థాయి నియామక ప్రక్రియ ఎప్పుడు పూర్తి అవుతుందని ఆశగా ఉన్నారు. దీన్ని క్యాష్ చేసుకునేందుకు ఇదిగో పూర్తి జాబితా మార్కులు, అదిగో ఫైనల్ మెరిట్ లిస్ట్ అంటూ ప్రచారం చేస్తున్నారు. దీంతో అభ్యర్థులు గందరగోళానికి గురి అవుతున్నారు.

ఆగస్టు 15 రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ… ఈ నెలాఖరుకు డీఎస్సీ నియామక ప్రక్రియ పూర్తి అవుతుందని స్పష్టం చేశారు. అందుకే అభ్యర్థులు కూడా ఎప్పుడెప్పుడు జాబితా విడుదల చేస్తారా అని ఆత్రంగా ఉన్నారు. ఇలాంటి టైంలో ఫేక్ ప్రచారం కంగారు పెట్టిస్తోంది. రకరకాల జాబితాలు వాట్సాప్ గ్రూప్లలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో డీఎస్సీ హెల్ప్లైన్కు వందల ఫోన్లు వస్తున్నాయి.

ఇలాంటి టైంలో డీఎస్సీకి సంబంధించిన అధికారులు కీలక ప్రకటన చేశారు. ” మెగా DSC-2025 నియామక ప్రక్రియకు సంబంధించి కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియా, ఇతర మార్గాల ద్వారా మార్ఫింగ్ , నకిలీ నార్మలైజ్డ్ స్కోర్లు, తప్పుడు టీచర్ నియామక ఉత్తర్వులు తయారు చేసి ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వం దృష్టికి వొచ్చింది . ఈ చర్యలు అభ్యర్థులను తప్పుదోవ పట్టించడమే కాక, అనవసరమైన భయాందోళనలుగ కలిగిస్తున్నాయి. నియామక ప్రక్రియ పారదర్శకత దెబ్బతీయాలనే ఆలోచనతో, కావాలనే ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియను ఆటంకం కలిగించాలనే ఉదేశ్యంతో చేస్తున్నట్లుగా అర్థమవుతోంది.” అని ఆందోళన వ్యక్తం చేసింది.

ఏదైనా విషయం కేవలం అధికారిక వెబ్సైట్ ద్వారానే తెలియజేస్తామని ప్రకటనలో తెలియజేశారు. “అన్ని అధికారిక స్కోర్లు, ఎంపిక జాబితాలు, నియామక ఆర్డర్లు మెగా DSC అధికారిక వెబ్సైటు, క్యాండిడేట్ లాగిన్లో పత్రికా ప్రకటనల ద్వారా మాత్రమే విడుదల చేస్తాం. సోషల్ మీడియా, అనధికార వెబ్సైట్ ప్రచారమయ్యే ఎలాంటి సమాచారం నిజం కాదు”అని అన్నారు.

నకిలీ సమాచారాన్ని ప్రసారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖాధికారులు హెచ్చరించారు. “ఇలాంటి నకిలీ పత్రాలు లేదా వివరాలు తయారు చేయడం, ప్రచారం చేయడం లేదా ఉపయోగించే వ్యక్తులపై చట్టాలకు అనుగుణంగా చట్ట పరమైన క్రిమినల్ చర్యలు తీసుకుంటాం. అలాంటి వ్యక్తి లేదా వ్యక్తులు నియామక ప్రక్రియను రద్దు చేస్తాం. ఇకపై ఎప్పుడూ కూడా వారు ఉద్యోగ పోటీ పరీక్షల్లో పాల్గొనకుండా చేస్తాం” అని అన్నారు.

నకిలీ ప్రచారాన్ని నమ్మొద్దని అభ్యర్థులకు అధికారులు సూచించారు. ” అభ్యర్థులు, ప్రజలు ఇలాంటి వదంతులను, దుష్ప్రచారాలను నమ్మొద్దు. కేవలం ప్రభుత్వం అధికారిక వెబ్సైట్లో ఉన్న ప్రకటనలు, నోటిఫికేషన్లు, ఫలితాలను మాత్రమే నమ్మాలి” అని తెలియజేసింది.

స్కోర్ కార్డులు విడుదల చేసిన అధికారులు టెట్ మార్కుల కరెక్షన్కు అవకాశం ఇచ్చారు. ఈ గడువు కూడా 15వ తేదీతో ముగిసింది. ఇప్పుడు వచ్చిన అభ్యర్థలను పరిగణలోకి తీసుకొని ఫైనల్ జాబితాపై కసరత్తు చేస్తున్నారు. ఇది ఒకట్రెండు రోజుల్లో పూర్తి అవుతుందని అంటున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.