తీరం దాటనున్న వాయుగుండం.. శ్రీకాకుళం జిల్లాలో పాఠశాలలకు సెలవు

వాయవ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ఇవాళ మధ్యాహ్నం ఒడిశా- ఉత్తర కోస్తా మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.


ప్రస్తుతం ఒడిశాలోని గోపాల్‌పూర్‌కి దక్షిణ ఆగ్నేయంగా వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. వాయవ్యంగా కదిలి మధ్యాహ్నానికి తీరం దాటనుంది. వాయుగుండం ప్రభావం వల్ల కోస్తాంధ్ర ప్రాంతంలో 45-55 కి.మీ వేగంతో తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. వాయుగుండం ప్రభావంతో ఉత్తర కోస్తాలో ఒకట్రెండు చోట్ల అతిభారీ వర్ష సూచన ఉంది. మిగిలిన కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించిన నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు ఇవాళ కూడా సెలవు ప్రకటించింది. నాగావళి నదిలో క్రమంగా వరద ప్రవాహం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అధికారులకు కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు, మంత్రి అచ్చెన్నాయుడు పలు సూచనలు చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ హెచ్చరికలు జారీ చేశారు. నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్‌లో 08942 240557తో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.