ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త ప్రభుత్వం వచ్చినా ఇబ్బందులు తొలగలేదు.. సమస్యలు పరిష్కారం కావడం లేదు. తెలంగాణ ప్రభుత్వానికి పోటీగా ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది.
ఎన్నికల్లో ఇచ్చిన భారీ హామీల్లో ఒక్కటీ కూడా నెరవేర్చకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ఇప్పటివరకు తమ సమస్యలపై దృష్టి సారించకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇది గ్రహించిన ఏపీ ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఈ క్రమంలోనే నేడు బుధవారం ఉద్యోగ సంఘాలతో సమావేశం కానుంది. ఉద్యోగులతో చర్చలు జరపనుంది.
ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ నెల 20వ తేదీన ఉద్యోగ సంఘాలతో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. అమరావతిలోని సచివాలయం కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం మొదలుకానుంది. ఈ సమావేశానికి ప్రభుత్వం 14 ఉద్యోగ సంఘాలు, అనుబంధ సంఘాలకు ఆహ్వానం పలికింది. ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ చర్చలు జరపనున్నారు.
వేతనాల పెంపు, కరువు భత్యం విడుదల, పెండింగ్ బిల్లులు వంటి ప్రధాన సమస్యలతోపాటు ఆర్థిక, ఆర్థికేతర సమస్యలు, వాటి పరిష్కారాలపై ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చించనుంది. ఈ సమావేశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గుర్తుచేయడంతోపాటు ఇప్పటివరకు అపరిష్కృతంగా ఉన్న సమస్యలు, డిమాండ్లను కూడా ప్రభుత్వం ముందు ఉంచనున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటులో కూడా ప్రభుత్వ ఉద్యోగులు కీలక పాత్ర పోషించారు. ఆ విషయాన్ని గుర్తించి తమ సమస్యలపై దృష్టి సారించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది. ఉద్యోగ వర్గాలతో చర్చల అనంతరం ప్రభుత్వం కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఏదో ఒక ప్రకటన ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట ఉంటుందని ఉద్యోగ సంఘాల్లో ఆశాభావం వ్యక్తమవుతోంది. మరి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది? చర్చలు సఫలమవుతాయా? అనేది కొన్ని గంటలు వేచి చూడాలి.
































