కూలిన ‘సినిమా చెట్టు’ తిరిగి పచ్చగా..

తూ.గో జిల్లా కొవ్వూరు కుమారదేవంలోని సినిమా చెట్టు తిరిగి చిగురించింది. ఈ చెట్టు 2024 గోదారి వరదల్లో కూలిపోగా, రోటరీ క్లబ్ ఆఫ్ ఐకాన్స్ కృషితో తిరిగి పునరుజ్జీవం పోసుకుందని స్థానికులు తెలిపారు.


దీనిని సినిమా చెట్టు అని పిలవడానికి కారణం లేకపోలేదు. ఈ చెట్టు దగ్గర క్లాసిక్ డే మూవీ `పాడి పంటలు` (1975) మొదలు ఇప్పటివరకూ దాదాపు 300 సినిమాల షూటింగులు జరిగాయి. రామ్ చరణ్ రంగస్థలం(2018)లోని కొన్ని సీన్లను ఈ సినిమా చెట్టు వద్ద తెరకెక్కించగా హైలైట్ అయ్యాయి.

ఇంతకీ ఈ సినిమా చెట్టు వయసు ఎంతో తెలుసా? 150 సంవత్సరాలు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ లతో పాటు, ఆ తర్వాతి తరంలో ఉన్న హీరోలందరినీ కూడా ఈ చెట్టు చూసింది. సీనియర్ వంశీ, జంధ్యాల, బాపు సహా చాలా మంది దిగ్ధర్శకులు గోదారి పరిసరాల్లో, ఈ చెట్టు దగ్గర సినిమాలు తీసారు. ఇక్కడ సినిమా తీస్తే చాలు సూపర్ హిట్టు అని ఒక నమ్మకం. అయితే వరదకు పడిపోవడంతో మోడువారింది. కానీ ఈ ఐకానిక్ చెట్టు తిరిగి చిగురించేందుకు కృషి చేసిన రోటరీ క్లబ్ టీమ్ ఇప్పుడు ప్రశంసలు అందుకుంటోంది.

తెలుగు రాష్ట్రాల్లో చక్రవర్తి అశోకుని కాలంలో పెంచిన మొక్కలు ఇప్పటికీ వటవృక్షాలుగా ఎదిగి అలానే నిలిచి ఉన్నాయి. 6 లైన్స్ హైవే నిర్మాణంతో చాలా వరకూ చెట్లు నరికేసారని ఆరోపణలొచ్చాయి. ఇప్పటికీ పాత కాలం నాటి చెట్లను కొట్టేస్తూనే ఉన్నారు. మారిన జీవన శైలితో పర్యావరణ హననం కొనసాగుతోంది. దీని పర్యవసానం భూమిపై పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అకాల వర్షాలు, వరదలు లేదా ప్రకృతి వైపరీత్యాలు, 50డిగ్రీల సెంటిగ్రేడ్ ఎండ వేడిని తట్టుకోవడానికి మానవాళి సిద్ధంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.