మెగా డీఎస్సీలో భాగంగా ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియ వేగవంతమవుతోంది.
ఫలితాలను ప్రకటించిన పాఠశాల విద్యాశాఖ ఖాళీలపై దృష్టి కేంద్రీకరించింది. సోమవారం అన్ని జిల్లాల నుంచి టీచర్ పోస్టుల ఖాళీలను స్వీకరించిన విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయం మంగళవారం వాటిని ధ్రువీకరించింది. డీఎస్సీలో ప్రకటించిన ఖాళీలకు అనుగుణంగా ప్రక్రియను చేపట్టనున్నారు. పాఠశాలల ఎంపికకు కసరత్తు ప్రారంభమైంది. నో టీచర్ స్కూళ్లు, బదిలీ అయి రిలీవర్ లేని కారణంగా అదే పాఠశాలల్లో పనిచేస్తున్న పోస్టులు, 50శాతం లోపు టీచర్లు ఉన్న పాఠశాలలకు కొత్త వారిని కేటాయించనున్నారు. డీఎస్సీలో ప్రతిభ చూపి అత్యధిక మార్కులు సాధించి మెరిట్ జాబి తాలో మొదట నిలిచిన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనను ఈనెల 21న నిర్వహించనున్నారు. గతంలో మాదిరి టీచర్ పోస్టులకు ఎంపికైన వారి సర్టిఫికెట్లు కాకుండా మెరిట్‌లో ముందున్న వారిని పరిశీలనకు ఆహ్వానిస్తున్నారు. అందుకు 1ః1 నిష్పత్తి ప్రకారం ఒక పోస్టుకు ఒక అభ్యర్థినే ఆయా రిజర్వేషన్ల ప్రాతిపదికగా ఎంపిక చేస్తున్నారు. పరిశీలనలో అన్నీ సక్రమంగా ఉన్నట్లు తేలిన తర్వాత పోస్టులకు అర్హులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులు డీఎస్సీ దరఖాస్తులో తాము పేర్కొన్న విద్యార్హతలు, రిజర్వేషన్లు, ఇతర వివరాలకు సంబంధించిన సర్టిఫికెట్లను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలి. అన్ని ఒరిజనల్ ధ్రువీకరణ పత్రాలతో పరిశీలనకు హాజరుకావాలి
14 కమిటీల ఏర్పాటు
జిల్లాలో డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనకు 14 కమిటీలను ఏర్పాటు చేశారు. ప్రతి దానిలో ఒక ఎంఈవో, ఒక గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు, ఒక డిప్యూటీ తహసీల్దార్‌తోపాటు కంప్యూటర్ నైపుణ్యం ఉన్న ఒక టీచర్‌ను నియమించారు. ఒక్కో కమిటీ 50 మంది టీచర్ల సర్టిఫికెట్లను పరిశీలించనుంది. ఒక అభ్యర్థి ఎన్ని పోస్టులకు దరఖాస్తు చేసి పరీక్ష రాసి మెరిట్ సాధించి సర్టిపికెట్ల పరిశీలనకు హాజరైతే ఆ అభ్యర్థి అన్ని సర్టిఫికెట్లనూ ఆ కమిటీ పరిశీలిస్తుంది. అభ్యర్థులు ఏదైనా సర్టిఫికెట్ అప్‌లోడ్ చేయకపోతే ఈ కమిటీ పరిశీలన సమయంలో అప్‌లోడ్ చేయిస్తుంది. పరిశీలన పూర్తయిన తర్వాత ఒక అభ్యర్థి రెండు, మూడు పోస్టులకు ఎంపికైతే వారి నుంచి ఆప్షన్ తీసుకొని ఆ పోస్టుకు ఎంపిక చేస్తారు. ఈ బృందాలోని ఎంఈవో, కంప్యూటర్ ఆపరేటర్‌కు బుధవారం విజయవాడ పోరంకిలోని మురళి రిసార్ట్స్‌లో శిక్షణ ఇవ్వనున్నారు.
కేంద్రం పరిశీలన
సర్టిఫికెట్ల పరిశీలనకు చెరువుకొమ్ముపాలెంలోని శ్రీసరస్వతి జూనియర్ కళాశాలను కేంద్రంగా ఎంపిక చేశారు. అందుకు 30 గదులు అవసరమవుతాయి. ఈ కేంద్రాన్ని మంగళవారం పాఠశాల విద్య గుంటూరు ఆర్‌జేడీ లింగేశ్వరరెడ్డి, డీఈవో కిరణ్‌కుమార్, ఎంఈవో కిషోర్‌బాబులు పరిశీలించారు. ఈ కేంద్రంలోని వసతుల పట్ల ఆర్‌జేడీ సంతృప్తి వ్యక్తం చేశారు.
































