క్రూయిజ్‌ కంట్రోల్‌తో హీరో గ్లామర్‌ ఎక్స్‌.. ధర ఎంతంటే?

 ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్‌ 125 సీసీ సెగ్మెంట్‌లో కొత్త బైక్‌ను లాంచ్‌ చేసింది. అత్యాధునిక ఫీచర్లు, డిజైన్‌తో గ్లామర్‌ ఎక్స్‌ను (Hero Glamour X) మార్కెట్‌లోకి విడుదల చేసింది.


పాత జనరేషన్‌ గ్లామర్‌తో పోలిస్తే చాలా వరకు ఇందులో మార్పులు చేశారు. ముఖ్యంగా 125 సీసీ విభాగంలో ఇటీవల కాలంలో పెరుగుతున్న పోటీ దృష్ట్యా కొన్ని కొత్త ఫీచర్లను కంపెనీ జోడించింది.

గ్లామర్‌ ఎక్స్‌ డ్రమ్‌ బ్రేక్‌ వేరియంట్ ధర రూ.89,999గా (ఎక్స్‌ షోరూమ్‌) కంపెనీ నిర్ణయించింది. వేరియంట్‌ను బట్టి దీని ధర రూ.99,999 వరకు ఉంటుంది. మునుపటి గ్లామర్‌తో పోలిస్తే ఈసారి బల్క్‌ బాడీ ఇచ్చారు. వంపులతో కూడిన ట్యాంక్‌, హెచ్‌ షేప్డ్‌ డీఆర్‌ఎల్స్‌తో కూడిన ఫ్రంట్‌ హెడ్‌ల్యాంప్‌తో వస్తోంది. సింగిల్‌ పీస్‌ సీటునే కొనసాగించారు. హ్యాండిల్‌ బార్‌ వెడల్పును 30 మిల్లీమీటర్లు పెంచారు. 170 ఎంఎం గ్రౌండ్‌ క్లియరెన్స్‌ ఉంది.

ఇందులో 124.7 సీసీ ఎయిర్‌ కూల్డ్‌ ఇంజిన్‌ ఇచ్చారు. ఇది 11.3 హెచ్‌పీ పవర్‌ను, 10.5 ఎన్‌ఎం పీక్‌ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో రంగులతో కూడిన ఎల్‌సీడీ స్క్రీన్‌ ఉంది. బ్లూటూత్‌ కనెక్టివిటీ, నావిగేషన్‌ వంటి 60 రకాల ఫీచర్లు ఇచ్చారు. అలాగే ఇందులో ఎలక్ట్రానిక్‌ థ్రోటల్‌ను ఆఫర్‌ చేస్తున్నారు. క్రూయిజ్‌ కంట్రోల్‌; ఎకో, రోడ్‌, పవర్‌ రైడింగ్‌ వంటి మూడు రకాల మోడ్స్‌ ఉన్నాయి. వెనుక వైపు ప్యానిక్‌ బ్రేక్‌ అలర్ట్‌ను జోడించారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.