ఇండియాలో ప్రతి నెలా ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్‌లు రిలీజ్ అవుతుంటాయి. ఇక టాలీవుడ్ టూ బాలీవుడ్‌లలో ఎందరో హీరోలు, హీరోయిన్లు. వీరిలో ప్రజలను ఆకట్టుకున్న సినిమాలేంటీ?
వెబ్ సిరీస్‌లు ఏంటీ? ఆయా నెలల్లో టాప్‌లో నిలిచిన వారెవరు? అనే దానిపై ఆర్మాక్స్ మీడియా అనే సంస్థ సర్వే నిర్వహించి ఫలితాలను ప్రకటిస్తూ ఉంటుంది. దీనిలో భాగంగా జూలై నెలలో ఇండియాలో మోస్ట్ పాపులర్ హీరో ఎవరన్న దానిపై సోషల్ మీడియాలో ప్రకటించింది. ఈ వివరాల్లోకి వెళితే..
మరోసారి మోస్ట్ పాపులర్ హీరోగా ప్రభాస్
ఆర్మాక్స్ మీడియా సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం .. ఇండియాలో జూలై నెలలో మోస్ట్ పాపులర్ హీరోగా నిలిచారు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. ఆయన ఈ లిస్ట్‌లో గత కొద్దినెలలుగా టాప్ ప్లేస్‌లో నిలుస్తూ వస్తున్నారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నారు ప్రభాస్. సినిమాలు చేసినా చేయకున్నా ఆయన క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. ఈ ఏడాది మంచు విష్ణు హీరోగా మంచు మోహన్ బాబు నిర్మించిన కన్నప్ప సినిమాలో రుద్ర అనే కీలకపాత్ర పోషించిన ప్రభాస్.. తన ఛరిష్మాతో సినిమాపై అంచనాలు పెంచేశారు.
ప్రభాస్ డైరీ ఫుల్
ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తోన్న ది రాజా సాబ్ డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది కాక సలార్ 2, కల్కి 2, స్పిరిట్, ఫౌజీ సినిమాలు లైనులో ఉన్నాయి. ఇవన్నీ భారీ బడ్జెట్ సినిమాలు కాగా.. వీటితో బాక్సాఫీస్‌పై ప్రభాస్ దండయాత్ర చేయడం మాత్రం ఖాయం. ఆయనతో సినిమాలు చేసేందుకు టాలీవుడ్ టూ బాలీవుడ్‌లలో దర్శక నిర్మాతలు వెయిట్ చేస్తున్నారు. ఇండియాలో డిమాండ్ విషయంలో ప్రభాస్ దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. ప్రభాస్ మరోసారి మోస్ట్ పాపులర్ హీరోగా నిలవడంతో ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
టాప్ 10 లిస్ట్ ఇదే
ఇక ఆర్మాక్స్ మీడియా మోస్ట్ పాపులర్ హీరోల లిస్ట్‌లో ఇళయ దళపతి విజయ్ 2వ స్థానంలో నిలవగా.. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ 3వ స్థానంలో ఉన్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 4వ స్థానంలో నిలవగా.. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ 5వ స్థానం దక్కించుకున్నారు. టాప్ 5లో నలుగురు దక్షిణాది హీరోలు చోటు దక్కించుకోగా.. ఒకే ఒక్క బాలీవుడ్ హీరో నిలిచారు. ఆ తర్వాత స్థానాల విషయానికి వస్తే .. మహేశ్ బాబు 6వ స్థానంలో, జూనియర్ ఎన్టీఆర్ 7వ స్థానంలో, రామ్ చరణ్ 8వ స్థానంలో, సల్మాన్ ఖాన్ 9వ స్థానంలో, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ 10వ స్థానంలో నిలిచారు.
నాని ప్లేస్ గల్లంతు
మొత్తంగా ఈ లిస్ట్‌లో టాప్ 10లో ఇద్దరు బాలీవుడ్ హీరోలు ఉండగా.. మిగిలిన 8 మంది సౌత్ స్టార్స్ కావడం విశేషం. దీనిని బట్టి సినిమాలు, క్రేజ్ విషయంలో దక్షిణాది ఇండస్ట్రీ డామినేషన్ స్పష్టంగా కనిపిస్తోంది. జూన్ నెలలో నేచురల్ స్టార్ నాని ఆశ్చర్యకరంగా 10వ స్థానంలోకి దూసుకురాగా.. జూలైకి వచ్చేసరికి మాత్రం తన స్థానాన్ని కోల్పోయారు. ఈ ప్లేస్‌లోకి జనసేనాని పవన్ కళ్యాణ్ వచ్చి చేరారు. హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ కావడంతో జూలైలో పవన్ కళ్యాణ్ నామస్మరణతో మారుమోగింది.
































