గోదావరికి ఉగ్రరూపం.. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ.

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ఉగ్రరూపం దాల్చింది.. వెల్లువలా వస్తున్న వరద ఉద్ధృతికి భద్రాచలం వద్ద 43 అడుగులకు స్థాయి నీటిమట్టంకు చేరింది..


దీంతో ఇక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. ఇదే ఒరవడి కొనసాగుతుండగా ధవళేశ్వరం వద్ద 10 అడుగుల స్థాయికి నీటిమట్టం చేరింది. దిగువకు 7.57 లక్షల క్యూసెక్కుల వరద నీరు వదులుతున్నారు అధికారులు.

దిగువనున్న గౌతమి, వశిష్ట, వైనతేయ నదీపాయలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. అంబేడ్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని లంక గ్రామాలకు వెళ్లే కాజ్వేలు నీట మునుగుతున్నాయి. పి.గన్నవరం మండల పరిధిలోని కనకాయిలంక కాజ్వే పైకి నీరు చేరింది. అదేవిధంగా సిద్ధాంతం తదితర ప్రాంతాల్లోని పుష్కరఘాట్లు నీటమునిగాయి. ఇదిలా ఉంటే శ్రీరామ్సాగర్ ప్రాజెక్ట్కు వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ప్రధాన గేట్ల నుంచి 1.73 క్యూసెక్కుల వరదనీటిని గోదావరిలోకి వదులుతున్నారు. ఇక గోదావరికి వరద ఉద్ధృతి పెరుగుతుండడంతో కోటిపల్లి, నర్సాపురం పంటు దాటింపులు పరిస్థితులను బట్టి నిలిపివేయాలని ఇప్పటికని ఇప్పటికే కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ ఆదేశాలు జారీచేశారు. దిగువ లంక ప్రాంతాలు వరదకు ముంపుకు గురయ్యే అవకాశాలున్నందున అధికారులను అప్రమత్తం చేశారు. అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీచేశారు.

నీట మునిగిన కనకాయిలంక కాజ్వే..

పి.గన్నవరం మండలం చాకలిపాలెంకు పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలికి మధ్య ఉన్న కనకాయిలంక కాజ్వే గోదావరి వరద ఉద్థృతికి నీట మునిగింది. కనకాయిలంక- అంబేడ్కర్ కోనసీమ జిల్లా పరిధిలోకి వచ్చే చాకలిపాలెం మధ్య రాకపోకలు సాగించేందుకు ఈ కాజ్వే కీలకం కాగా అధికారులు అప్రమత్తం అయ్యారు. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద దిగువకు మరింత వరద నీరు వదిలితే ఈ ప్రాంతం అంతా ముంపుకు గురయ్యే పరిస్థితి ఉన్నందున అటు యలమంచిలి, ఇటు పి.గన్నవరం తహసీల్దార్లు ఈప్రాంతాన్ని పరిశీలించి పడవలను ఏర్పాటు చేయించారు. పీహెచ్సీ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు ఏర్పాటుకు ఆదేశాలు జారీచేశారు.

అవస్థలుతోనే పడవ ప్రయాణం..

గోదావరి వదర పోటెత్తుతుంటే గోదావరి లంక ప్రాంత ప్రజలకు పాట్లు తప్పవు.. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో గౌతమి నది, వశిష్ట నదీప్రవాహాలకు పి.గన్నవరం నియోజకవర్గంలోని పలు లంక గ్రామాల ప్రజలు అవస్థలు మొదలయ్యాయి.. పి.గన్నవరం మండల పరిధిలో బూరుగులంక, అరిగిలెవారిపాలెం, ఊడిమూడిలంక, అయోధ్యలంక, తదితర ప్రాంతాల ప్రజలు ఇంజన్ పడవల్లో రాకపోకలు సాగిస్తున్నారు.

అయినవిల్లి మండల పరిధిలో కూడా అయినవిల్లి లంక, వీరవల్లిపాలెం తదితర ప్రాంతాల్లో వరద నీరు క్రమక్రమంగా చేరుతోంది.. గౌతమి నదీ తీరానికి ఆనుకుని ఉన్నటువంటి ముమ్మిడివరం, ఐ.పోలవరం మండలాల్లోని పలు లంక ప్రాంతాల్లోకి వరద నీరు చేరుతోంది.. వశిష్ట నదీపాయకు ఆనుకుని ఉన్నటువంటి పలు గోదావరి నదీపరివాహక ప్రాంతాల్లోను, వైనతేయకు ఆనుకుని ఉన్నటువంటి అల్లవరం మండల పరిధిలోకి వచ్చే పలు పల్లిపాలెం, రెబ్బనపల్లి, గోపాయిలంక తదితర ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. కేంద్రపాలిత ప్రాంతమైన పదుచ్చేరిలోని వృద్ధగౌతమి నదీపాయకు ఆనుకుని ఉన్న పలు మత్స్యకార ప్రాంతాల్లోని ప్రజలను అక్కడి అధికారులు అప్రమత్తం చేశారు..

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.