పుట్టుక, చావు మన చేతిలో ఉండదు. సమయం వచ్చినప్పుడు అవే జరుగుతూ ఉంటాయి. అయితే హిందూ సాంప్రదాయం ప్రకారం పుట్టిన, చనిపోయిన సమయంలో కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు.
ఒక కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఆ వ్యక్తిని డబ్బు చప్పులతో పాడిపై తీసుకెళ్లి దహనం లేదా ఖననం చేస్తారు. అయితే ఈ సమయంలో వ్యక్తి కుటుంబ సభ్యుల కు సూతకం ఉంటుందని అంటారు. వారం రోజులపాటు వీరిని ఎవరు ముట్టుకోకుండా ఉంటారు. 11 రోజుల తర్వాత పెద్దకర్మ కార్యక్రమం నిర్వహిస్తారు. ఆ తర్వాత ఏడాది పాటు దేవాలయాలకు వెళ్ళద్దని చెబుతూ ఉంటారు. అసలు వీరు దేవాలయాలకు ఎందుకు వెళ్లకూడదు? కొందరు పండితులు చెబుతున్న విషయం ఏంటి?
ఇంట్లో ఎవరైనా చనిపోతే వారిని అపవి త్రులుగా భావిస్తారు. ఇలా ఉన్నంతకాలం సూతకం అని అంటారు. 11 లేదా 13 రోజులపాటు సూతక కాలం ఉంటుంది. అయితే ఈ 13 రోజులపాటు చనిపోయిన వ్యక్తి కోసం ప్రత్యేకంగా ఉండాలి. ఏ విధమైన శుభకార్యాలు నిర్వహించకుండా.. ఎవరి ఇంటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండాలి. 13 రోజుల తర్వాత కార్యక్రమం పూర్తయిన తర్వాత బయటకు వెళ్లొచ్చు.
కానీ కొందరు ఏడాది పాటు దేవాలయాలకు వెళ్ళకూడదని చెబుతూ ఉంటారు. అయితే కొందరు పండితులు చెబుతున్న ప్రకారం.. 13 రోజులపాటు మాత్రమే సూతకం ఉంటుందని ఆ తర్వాత దేవాలయాలకు వెళ్లే అలవాటు ఉన్నవారు వెళ్ళవచ్చని అంటున్నారు. అయితే దేవాలయాలకు వెళ్లే ముందు నది స్నానం చేయాలని అంటున్నారు. నది పూర్తి చేసిన తర్వాత ఆలయాలకు వెళ్లడం మంచిదని చెబుతున్నారు. అయితే కొందరు సాంప్రదాయవాదులు మాత్రం ఏడాది పాటు ఆలయాలకు, శుభకార్యాలకు దూరంగా ఉండాలని చెబుతున్నారు. కానీ ఈ కాలంలో ఇలా చేయడం వల్ల ఎన్నో నష్టాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. నిత్యం దేవాలయాలకు వెళ్లి మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలని అనుకునేవారు.. ఇలా ఏడాది పాటు దేవాలయాలకు వెళ్లకుండా ఉండడం వల్ల ప్రశాంతతను కోల్పోతారని అంటున్నారు.
హిందూ సాంప్రదాయంలో కొందరు విధించిన ఈ ఆచారాలతో ఈ కాలంలో మతమార్పిడి ఎక్కువగా జరుగుతుందని అంటున్నారు. దేవాలయాలకు వెళ్లడం తగ్గించుకునేవారు ఇతర మతాలపై ఆసక్తిని పెంచుకుంటున్నారని పండితులు పేర్కొంటున్నారు. అలా ఇతర మతాలపై ఆశలు పెరిగి హిందూ మతాన్ని దూరం చేసుకుంటున్నారని అంటున్నారు. ఇతర మతాల్లో ఒక వ్యక్తి చనిపోతే కొన్ని రోజులపాటు మాత్రమే అపవిత్రంగా ఉంటారు. ఆ తర్వాత యధావిధిగా తమ ప్రార్థనలు చేస్తూ ఉంటారు. అలాగే హిందూ ధర్మం ప్రకారం కూడా 13 రోజులపాటు మాత్రమే దేవాలయాలకు, శుభకార్యాలకు దూరంగా ఉండాలి. ఆ తర్వాత యధావిధిగా కార్యకలాపాలు చేసుకోవచ్చని చెబుతున్నారు.































