50 గంటల అరెస్టుతో ఉద్యోగిని సస్పెండ్ చేస్తుంటే పీఎంలకు ఎందుకు వర్తించదు?

తీవ్రమైన నేరారోపణలతో అరెస్టయి వరుసగా 30 రోజుల పాటు నిర్బంధంలో ఉంటే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, కేంద్ర మంతులను పదవి నుంచి తొలగించేందుకు వీలు కల్పించే బిల్లును కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఇటీవల లోక్‌సభలో ప్రవేశపెట్టారు.


ఈ బిల్లును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi_ తాజాగా సమర్ధించారు. 50 గంటలు జైలు శిక్ష అనుభవిస్తే ఒక ప్రభుత్వ ఉద్యోగి సస్పెన్షన్‌కు గురవుతాడని, అలాంటప్పుడు ఒక ప్రధాని, ముఖ్యమంత్రి లేదా మంత్రులకు ఈ నిబంధన ఎందుకు వర్తించదని ప్రశ్నించారు.

బిహార్‌లోని గయాజిలో శుక్రవారంనాడు జరిగిన ర్యాలీలో ప్రధాని మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగి 50 గంటలు జైలు శిక్ష అనుభవిస్తే అతను డ్రైవర్ అయినా, క్లర్క్ అయినా, ప్యూన్ అయినా ఉద్యోగం నుంచి సస్పెండ్ అవుతాడని చెప్పారు. కానీ సీఎం, మంత్రి, చివరకు పీఎం మాత్రం జైలుకు వెళ్లినా పదవిని ఎంజాయ్ చేస్తున్నారని అన్నారు. ఎన్డీయే ప్రభుత్వం అవినీతికి వ్యతిరేకంగా చట్టం తెచ్చిందని, ప్రధానమంత్రి కూడా ఆ పరిధిలోకి వస్తారని చెప్పారు.

‘గతంలో జైలు నుంచి కూడా ఫైళ్లపై సంతకాలు చేయడం, ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయడం మనం చూశాం. లీడర్లకు అలాంటి వైఖరి ఉంటే అవినీతితో ఎలా పోరాడతాం?’ అని మోదీ ప్రశ్నించారు. అవినీతికి పాల్పడే నేతలే పరిపాలన చేస్తే దేశంలో అవినీతిని ఎలా తొలగించగలమని నిలదీశారు. నేరచరిత్ర కలిగిన నేతలకు ఇకపై అలాటి అవకాశం ఇవ్వమని చెప్పారు

అమిత్‌షా ప్రవేశపెట్టిన బిల్లులో కనీసం ఐదేళ్ల శిక్షపడే నేరాలకు పాల్పడి, నెలరోజులు నిర్బంధంలో ఉన్న నేతల పదవి పోతుంది. వారంతట వారు రాజీనామా చేయకపోయినా పదవిని ఆటోమాటిక్‌గా కోల్పోతారు. విపక్షాలు ఈ బిల్లుపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపారు. పార్లమెంటు తదుపరి సమావేశాల మొదటి వారంలోని చివరి రోజులోగా కమిటీ నివేదికను సభకు సమర్పించాల్సి ఉంటుంది. పార్లమెంటు తదుపరి సమావేశం వచ్చే నవంబర్ మూడోవారంలో ఉంటుంది.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.