25న డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన

ఉమ్మడి జిల్లాలో డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికై న అభ్యర్థులకు ఈ నెల 25న సర్టిఫికెట్ల పరిశీలన చేసేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు సిద్ధం చేసింది.


అనంతపురం రూరల్‌ పరిధిలోని ఆలమూరు రోడ్డులోని బాలాజీ ఎంసీఏ కళాశాల వేదికగా సర్టిఫికెట్ల పరిశీలన చేయనున్నారు. ఏర్పాట్లను శుక్రవారం డీఈఓ ప్రసాద్‌బాబు, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ మునీర్‌ అహమ్మద్‌ పరిశీలించారు. సర్టిఫికెట్ల పరిశీలన కోసం మొత్తం 18 బృందాలను నియమించారు. అన్ని కేడర్ల పోస్టులు కలిపి జిల్లాలో మొత్తం 807 పోస్టులను భర్తీ చేయనున్నారు. సర్టిఫికెట్ల పరిశీలనకు ఏర్పాటు చేసిన బృందాలకు శనివారం బాలాజీ ఎంసీఏ కళాశాలలో మధ్యాహ్నం 3 గంటలకు శిక్షణ ఉంటుందని డీఈఓ తెలిపారు.

డీఎస్సీ మెరిట్‌ జాబితా విడుదల

డీఎస్సీ-25కు సంబంధించి అన్ని సబ్జెక్టుల మెరిట్‌ జాబితాలను విద్యాశాఖ శుక్రవారం రాత్రి విడుదల చేసింది. జాబితాలను డీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ https://apdsc.apcfss.inలో, జిల్లా విద్యాశాఖ వెబ్‌సైట్లోనూ ఉంచారు. అభ్యర్థులకు వ్యక్తిగత మెగా డీఎస్సీ లాగిన్‌ ఐడీలు ద్వారా కాల్‌ లెటర్‌ పంపుతామని అధికారులు పేర్కొన్నారు. కాల్‌ లెటర్‌లో పేర్కొన్న సూచనలను అనుసరించాలని వెల్లడించారు. ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో పాటు ఇటీవల తీసుకున్న కుల ధ్రువీకరణ పత్రం, గెజిటెడ్‌ అధికారితో ధ్రువీకరించిన మూడు సెట్లు సర్టిఫికెట్ల జిరాక్స్‌ కాపీలు, 5 పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలతో పరిశీలనకు హాజరుకావాలని విద్యాశాఖ అధికారులు తెలిపారు. అంతకుముందే సర్టిఫికెట్లను వెబ్‌సైట్లో అప్లోడ్‌ చేయాలన్నారు. సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకాని, అర్హతలేని అభ్యర్థుల అభ్యర్థిత్వం రద్దు చేస్తామని స్పష్టం చేశారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.