ఏపీ ప్రభుత్వం( AP government ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రధాన నగరాల్లో యాచకులు లేకుండా చూడాలని చూస్తోంది. ఇప్పటికే విశాఖలో పోలీస్ శాఖ ఆ పని చేస్తోంది.
అయితే ఇప్పుడు ప్రధాన నగరాల్లో యాచకులు లేకుండా చేయాలని.. వృత్తిని నిరోధించే ఏపీ యాచక నిరోధక చట్ట సవరణ ముసాయిదా బిల్లుకు ఏపీ క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. త్వరలో జరగనున్న అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లు ఆమోదం పొందనుంది. గవర్నర్ ఆమోదంతో చట్టాన్ని అమలులోకి తెస్తారు. ఈ బిల్లు ప్రకారం రాష్ట్రంలో ప్రధాన నగరాలుగా ఉన్న విశాఖ విజయవాడ, తిరుపతి, కర్నూలు, అమరావతి, గుంటూరు, రాజమండ్రి, విజయనగరంలో యాచక వృత్తిని నిషేధిస్తారు. యాచకులు లేని నగరాలుగా తీర్చిదిద్దనున్నారు. ప్రస్తుతం పేదరిక నిర్మూలనకు ఏపీ ప్రభుత్వం పి4 ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంకోవైపు పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో పేదరికాన్ని సూచికగా ఉండే యాచకులు లేకుండా చేయాలన్నది ప్రభుత్వ సంకల్పం.
నాలుగో స్థానంలో ఏపీ
ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాచకులు ఉన్న రాష్ట్రాల్లో ఉత్తర ప్రదేశ్( Uttar Pradesh) తొలి స్థానంలో ఉంది. తమిళనాడు రెండు, ఢిల్లీ మూడో స్థానంలో ఉంది. నాలుగో స్థానంలో ఏపీ కొనసాగుతోంది. అయితే ఏపీలో యాచకుల సంఖ్యను తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రధానంగా పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలని చూస్తోంది. దానికి యాచకులు అవరోధంగా భావిస్తోంది. అందుకే వారికి ప్రత్యామ్నాయ ఉపాధి, విద్యా వైద్యం వంటి సౌకర్యాలు కల్పించి.. సాధారణ పౌరులుగా జీవించేలా చేయనుంది. వారికోసం ప్రత్యేక షెల్టర్లను సైతం అందుబాటులోకి తేనుంది.
ఇప్పటికే విశాఖలో..
విశాఖలో ( Visakhapatnam)పోలీస్ శాఖ ద్వారా యాచకులను షెల్టర్లకు తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. చాలామంది గ్రామాల నుంచి వచ్చి యాచక వృత్తిని ఆశ్రయిస్తున్నారు. అటువంటి వారిని గుర్తించి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. సంక్షేమ పథకాలతో పాటు పౌర సేవలు అందించి వారిని సాధారణ పౌరులుగా మార్చుతున్నారు. విశాఖలో వీధిలో కనిపించే యాచకులను గుర్తిస్తున్నారు. నిరాశ్రయులకు భోజన వసతి కల్పిస్తున్నారు. వారికోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా తరువాత నగరాల్లో యాచకుల సంఖ్య పెరిగింది. ముఖ్యంగా ప్రముఖ దేవస్థానాలు ఉన్నచోట వీరు పెరుగుతూ వచ్చారు. తాజాగా ప్రభుత్వం యాచక వృత్తిని నిషేధించాలని భావించింది. ప్రధాన నగరాలతో పాటు ప్రముఖ పుణ్యక్షేత్రాలను సైతం ఆ జాబితాలో చేర్చింది. తిరుమల, విజయవాడ కనకదుర్గమ్మ, శ్రీశైలం, సింహాచలం, అన్నవరం, రామ తీర్థాలు వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో సైతం ఇకనుంచి యాచకులు కనిపించకుండా పగడ్బందీ చర్యలు చేపట్టనున్నారు.
































