పాఠశాల సిబ్బంది (Odisha School) నిర్లక్ష్యం ఓ చిన్నారి ప్రాణాల మీదకు తెచ్చింది. రాత్రంతా తరగతి గదిలోనే నరకయాతన అనుభవించాల్సి వచ్చింది.
బయటపడే ప్రయత్నంలో కిటికీ గ్రిల్ మధ్య ఇరుక్కుపోయి (Student Head Stuck In Grill) తీవ్రంగా గాయపడింది. ఈ హృదయ విదారక ఘటన ఒడిశా (Odisha0లోని కియోంఝర్ (Keonjhar) జిల్లాలో వెలుగు చూసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జ్యోత్స్న దెహూరి అనే ఎనిమిదేళ్ల చిన్నారి బన్స్‌పాల్ బ్లాక్ పరిధిలోని అంజార్‌లో (Anjar) గల ప్రభుత్వ ఉన్నత ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. గురువారం రోజున పాఠశాలకు వచ్చిన చిన్నారి స్కూల్ ముగిసే సమయానికి క్లాస్ రూమ్ బెంచ్‌పై నిద్రలోకి జారుకుంది. పాఠశాల ముగియడంతో పిల్లలంతా వెళ్లిపోయారు. అయితే చిన్నారి లోపల ఉన్న విషయాన్ని గమనించని సిబ్బంది క్లాస్ రూమ్‌కు తాళం వేసి వెళ్లిపోయారు.
మెలుకవలోకి వచ్చిన చిన్నారి బయటపడేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. ఈ క్రమంలో కిటికీ రెయిలింగ్‌లో తల ఇరుక్కుపోయింది. దీంతో రాత్రంతా చిన్నారి నరకయాతన అనుభవించింది. ఇక రాత్రి అయినా పాప ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందారు. గ్రామస్థులతో కలిసి చిన్నారి జాడ కోసం తీవ్రంగా గాలించారు. పాప ఎక్కడా కనిపించలేదు. ఉదయం పాఠశాలవైపు వెళ్లిన గ్రామస్థులకు గది కిటికీ రెయిలింగ్ మధ్య ఓ చిన్నారి ఇరుక్కుని కనిపించింది.
వెంటనే అప్రమత్తమైన గ్రామస్థులు అధికారులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న సహాయక బృందాలు తీవ్రంగా శ్రమించి చిన్నారిని క్షేమంగా బయటకు తీశారు. అనంతరం పాపను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఈ ఘటనపై పాఠశాల ఉపాధ్యాయురాలు సంజిత స్పందిస్తూ.. ‘సాధారణంగా స్కూల్ వంట మనిషి గదులకు తాళాలు వేస్తారు. కానీ, భారీ వర్షం కారణంగా ఆమె రాకపోవడంతో సాయంత్రం 4:10 గంటల సమయంలో ఏడో తరగతి విద్యార్థులిద్దరికి తాళాలు వేయమని పంపించాం. రెండో తరగతి పాప బెంచీ కింద నిద్రపోవడంతో ఆ విద్యార్థులు గమనించలేదు’ అని వివరించారు. మరోవైపు తాజా ఘటనపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో జిల్లా యంత్రాంగం ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. మరోవైపు ప్రిన్సిపల్‌ను సస్పెండ్ చేసింది.
































