రక్తపోటు లేదా బీపీ అనేది మన శరీరంలో రక్తం గుండె నుంచి ధమనుల్లో ప్రవహించే తీరును కొలుస్తుంది. దీనిని రెండు విధానాల్లో చూపిస్తాం. సిస్టొలిక్ (పై సంఖ్య), డయాస్టొలిక్ (కింది సంఖ్య).
సిస్టొలిక్ అంటే గుండె రక్తాన్ని పంప్ చేసేటప్పుడు వచ్చే ఒత్తిడి, డయాస్టొలిక్ అంటే గుండె విశ్రాంతి తీసుకునేటప్పుడు ఉండే ఒత్తిడి. అయితే అమెరికన్ హార్ట్ అసోసియేషన్ (AHA) తాజాగా రక్తపోటు నియంత్రణకు కొత్త మార్గదర్శకాలను విడుదల (BP New Guidelines) చేసింది. ఎందుకంటే హై బీపీ అనేది గుండె జబ్బులు, స్ట్రోక్, డిమెన్షియా, మూత్రపిండ వ్యాధులకు ప్రధాన కారణంగా ఉంది.
మొదట్లో నియంత్రించడానికి..
ఇది మన ఆరోగ్యానికి పెద్ద రిస్క్ అని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో హై బీపీని మొదట్లోనే నియంత్రించడానికి, జీవనశైలి మార్పులతో పాటు, అవసరమైతే మందులు కూడా వెంటనే మొదలు పెట్టాలని AHA సూచిస్తోంది. మన భారతీయులకు గుండె జబ్బులు వచ్చే అవకాశం ఇతర దేశాలవారితో పోలిస్తే తొందరగా ఉంటుంది. కాబట్టి ఈ కొత్త నిబంధనలు మనకు కూడా చాలా ముఖ్యమని డాక్టర్ సింగ్ అంటున్నారు.
కొత్త బీపీ స్థాయిలు ఏంటి?
గతంలో 130/90 mm Hgని సాధారణ బీపీగా భావించేవారు. కానీ ఇప్పుడు AHA కొత్తగా చెబుతోంది. సాధారణ బీపీ అంటే సిస్టొలిక్ 120 mm Hg కంటే తక్కువ, డయాస్టొలిక్ 80 mm Hg కంటే తక్కువ ఉండాలి. అంటే మీ బీపీ ఇప్పుడు 115-119/70-79 mm Hg లోపల ఉంటేనే బాగుందని భావిస్తారు.
- ఎలివేటెడ్ బీపీ: సిస్టొలిక్ 120-129 mm Hg, డయాస్టొలిక్ <80 mm Hg.
- స్టేజ్ 1 హైపర్‌టెన్షన్: సిస్టొలిక్ 130-139 mm Hg లేదా డయాస్టొలిక్ 80-89 mm Hg.
- స్టేజ్ 2 హైపర్‌టెన్షన్: సిస్టొలిక్ ≥140 mm Hg లేదా డయాస్టొలిక్ ≥90 mm Hg.
ఈ కొత్త నిబంధనలు మెదడు ఆరోగ్యం, గర్భంతో సంబంధం ఉన్న సమస్యలను నివారించడానికి రూపొందించబడ్డాయి. హై బీపీ మెదడులోని చిన్న రక్తనాళాలను దెబ్బతీస్తుంది. ఇది మతిమరుపు లాంటి సమస్యలకు దారితీస్తుందని డాక్టర్ అన్నారు.
ఎప్పుడు మందులు మొదలు పెట్టాలి?
కొత్త నిబంధనల ప్రకారం సిస్టొలిక్ 130-139 mm Hg ఉంటే ముందుగా జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. ఒకవేళ ఈ మార్పుల తర్వాత కూడా బీపీ తగ్గకపోతే లేదా డయాస్టొలిక్ 80-90 mm Hgకి చేరితే, మందులు మొదలు పెట్టాలి. ఇది గుండె జబ్బులు ఉన్నవారికి మరింత ఒత్తిడిని నివారించడానికి అవసరమని తెలిపారు.
ఒకవేళ బీపీ 140/90 mm Hg దాటితే, వెంటనే రెండు మందులు మొదలు పెట్టాలని AHA సిఫార్సు చేస్తోంది. విభిన్న రకాల మందులను కలిపి ఉపయోగిస్తే, ఒకే మందును ఎక్కువ డోస్‌లో ఇవ్వడం కంటే మంచి ఫలితాలు వస్తాయని డాక్టర్ సింగ్ అన్నారు.
ఏ టెస్టులు చేయించుకోవాలి?
హై బీపీని నియంత్రించడానికి కొన్ని ముఖ్యమైన టెస్టులు చేయించుకోవాలని AHA సూచిస్తోంది. లివర్ ఫంక్షన్ టెస్ట్ (LFT), కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ (KFT), సోడియం-పొటాసియం బ్యాలెన్స్, యూరిక్ యాసిడ్, బ్లడ్ షుగర్ ప్రొఫైల్‌లు ఇందులో ఉన్నాయి. అయితే ఈ సారి కిడ్నీ, హార్మోన్ సంబంధిత టెస్టులపై ఎక్కువ దృష్టి పెట్టారు. ముఖ్యంగా స్టేజ్ 2 హైపర్‌టెన్షన్ ఉన్నవారికి యూరిన్ ఆల్బుమిన్-టు-క్రియాటినిన్ రేషియో టెస్ట్ (కిడ్నీ ఆరోగ్యం కోసం), ఆల్డోస్టెరోన్-టు-రెనిన్ రేషియో టెస్ట్ (హార్మోన్ సంబంధిత బీపీ కోసం) తప్పనిసరి.
నివారణ ఎలా?
- బీపీని నియంత్రించడానికి AHA కొన్ని సాధారణ సలహాలు ఇస్తోంది
- ఉప్పు తగ్గించండి: రోజుకు 2,300 మి.గ్రా. కంటే తక్కువ ఉప్పు తీసుకోవాలి
- ఆల్కహాల్‌ను పరిమితం చేయండి. పురుషులు రోజుకు రెండు డ్రింక్స్, మహిళలు ఒక డ్రింక్ మాత్రమే
- ఒత్తిడి తగ్గించండి: ధ్యానం, యోగా, శ్వాస వ్యాయామాలు ప్రతి రోజు చేయండి
- బరువు తగ్గించండి: కనీసం 5% బరువు తగ్గడం లక్ష్యంగా పెట్టుకోండి
- వ్యాయామం: వారానికి 75-150 నిమిషాలు కార్డియో లేదా వెయిట్ ట్రైనింగ్ చేయండి
అలాగే డైట్‌ను అనుసరించమని AHA సూచిస్తోంది. అంటే కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, గింజలు, లీన్ మాంసం, చేపలు, తక్కువ కొవ్వు ఉన్న ఆహారం తీసుకోవాలి. ఇంట్లో బీపీని క్రమం తప్పకుండా చెక్ చేసుకోవడం చాలా ముఖ్యమని సూచించారు.
































