కేంద్రం గుడ్ న్యూస్..లోన్ పొందడానికి సిబిల్ స్కోర్ తప్పనిసరి కాదు, కానీ

లోన్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో లోన్ కోసం సిబిల్ స్కోర్ తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. మీరు తొలిసారి లోన్ అప్లై చేయాలనుకుంటే, మీ క్రెడిట్ స్కోర్ లేకపోయినా బ్యాంకులు మీ అప్లికేషన్‌ను రిఫ్యూ చేయలేవు.


దీన్ని బట్టి చూస్తే, మీరు కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలని లేదా మీ వ్యక్తిగత అవసరాల కోసం లోన్ తీసుకోవాలని చూస్తున్నట్లయితే సిబిల్ స్కోర్ లేకపోయినా ( CIBIL Score Not Required) భయపడాల్సిన పని లేదు.

కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరీ ఇటీవల లోక్‌సభలో జరిగిన మాన్సూన్ సెషన్‌లో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. మొదటిసారిగా లోన్ కోరే వారు క్రెడిట్ హిస్టరీ లేకపోతే కేవలం దానివల్ల వారి అప్లికేషన్‌ను తిరస్కరించకూడదని RBI తమ మార్గదర్శకాలలో తెలిపింది.

సిబిల్ స్కోర్ అంటే ఏంటి?

సిబిల్ స్కోర్ అనేది 300 నుంచి 900 వరకు ఉండే మూడు అంకెల సంఖ్య. ఇది ఒక వ్యక్తి రుణం తీసుకునే అర్హతను సూచిస్తుంది. ఈ స్కోర్‌ను క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (ఇండియా) లిమిటెడ్ (CIBIL) అందిస్తుంది. సాధారణంగా పర్సనల్ లోన్, గోల్డ్ లోన్, హోమ్ లోన్ లేదా ఇతర బ్యాంకు రుణాలకు అర్హతను నిర్ణయించడానికి ఈ స్కోర్‌ను బ్యాంకులు పరిగణనలోకి తీసుకుంటాయి. అయితే, మొదటిసారి రుణం తీసుకునేవారికి ఈ స్కోర్ లేకపోయినా సమస్య లేదని ఇప్పుడు RBI స్పష్టం చేసింది.

RBI ఏం చెప్పింది?

RBI మాస్టర్ డైరెక్షన్ (తేదీ 6.1.2025) ప్రకారం, మొదటిసారి రుణం తీసుకునేవారి దరఖాస్తులను కేవలం క్రెడిట్ హిస్టరీ లేదని లేదా సిబిల్ స్కోర్ తక్కువగా ఉందని తిరస్కరించకూడదని బ్యాంకులకు సూచించింది. అంటే, మీరు ఇంతకు ముందు ఎప్పుడూ రుణం తీసుకోకపోయినా, మీ దరఖాస్తును బ్యాంకు తిరస్కరించకూడదు. ఇది చాలా పెద్ద మార్పు, ఎందుకంటే ఇప్పటివరకు చాలా మంది సిబిల్ స్కోర్ లేకపోవడం వల్ల రుణం పొందలేకపోతున్నారు.

బ్యాంకులు ఏం చేస్తాయి?

సిబిల్ స్కోర్ తప్పనిసరి కాదని చెప్పినప్పటికీ, బ్యాంకులు రుణ దరఖాస్తుదారులపై కొంత జాగ్రత్త వహించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచించింది. అంటే, బ్యాంకులు మీ బ్యాక్‌గ్రౌండ్‌ను తనిఖీ చేస్తాయి. గతంలో మీరు ఏదైనా రుణం తీసుకుని ఉంటే, దాని చెల్లింపు చరిత్ర, ఆలస్యమైన చెల్లింపులు, రుణాలు సెటిల్ చేయడం, రీస్ట్రక్చర్ చేయడం లేదా రైట్-ఆఫ్ చేయడం వంటి విషయాలను పరిశీలిస్తాయి. కానీ, మీరు మొదటిసారి రుణం తీసుకుంటున్నట్లయితే, ఈ తనిఖీలు చాలా సరళంగా ఉంటాయి. ఎందుకంటే మీకు క్రెడిట్ హిస్టరీ అనేది ఉండదు.

ఎందుకు ముఖ్యం?

ఈ కొత్త నిబంధన మొదటిసారి రుణం తీసుకునేవారికి మంచి అవకాశాన్ని అందిస్తుంది. చాలామంది యువత, చిన్న వ్యాపారులు లేదా క్రెడిట్ హిస్టరీ లేని వారు ఇప్పుడు బ్యాంకు రుణాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి ధైర్యం చేయవచ్చు. ఇది ఆర్థిక స్వాతంత్రాన్ని పెంచడంతో పాటు, ఎక్కువ మందికి రుణ సౌకర్యాలను అందుబాటులోకి తెస్తుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.