మండలంలోని గొందిపాకలు పంచాయతీ యర్రవరం గ్రామంలో ఓ గిరిజన రైతు పెరట్లో యాలకులు విరగ్గాశాయి. సుమారు 20 ఏళ్ల క్రితం చింతపల్లి ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు యాలకులపై పరిశోధనలు నిర్వహించి గిరిజన ప్రాంతం సాగుకు అనుకూలమని నిర్ధారించారు.
ఉద్యాన పరిశోధన స్థానంలో శాస్త్రవేత్తలు యాలకుల మొక్కలను కొన్నేళ్లుగా సాగు చేస్తున్నారు. యర్రవరం గ్రామానికి చెందిన గూడెపు వేణుగోపాల్ రాజు నాలుగేళ్ల క్రితం ఉద్యాన పరిశోధన స్థానంలో జరిగిన శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. యాలకుల సాగుకు గిరిజన ప్రాంతం అనుకూలమని శాస్త్రవేత్తలు చెప్పడంతో కొన్ని మొక్కలను బెంగళూరు నుంచి దిగుమతి చేసుకుని పెరట్లో నాట్లు వేశారు. గత ఏడాది నుంచి కొన్ని మొక్కలు కాపుకొచ్చాయి.
ప్రస్తుతం సీజన్ కావడంతో యాలకుల దిగుబడులు వచ్చాయి. సాధారణం మూడేళ్ల తరువాత 100 గ్రాముల నుంచి 200 గ్రామాల దిగుబడులు వస్తాయి. అయితే వేణుగోపాల్ రాజు పెరట్లో సాగు చేస్తున్న మొక్కల్లో ఈ ఏడాది ఒక్కొక్కటి సుమారు 500 గ్రాములకు పైగా యాలకులు రావడంతో ఆయన సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
































