బంగారం ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. అయితే అందరి కన్ను సెప్టెంబర్ మీదనే ఉంది. వచ్చే నెలలో బంగారం ధరలు ఎలా ఉండబోతున్నాయనే ఆసక్తి నెలకొంది.
సామాన్యులకు మళ్లీ పసిడి షాక్ ఇస్తుందా.. పెట్టుబడిదారులకు లాభాల పంట పండిస్తుందా.. అనే దానిపై ఇప్పటి నుంచే విశ్లేషణలు చేస్తున్నారు. ఇక సెప్టెంబర్ మొదటి వారంలో జరగనున్న 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం దేశ వ్యాప్తంగా Gold వినియోగదారులు, వ్యాపార వర్గాలు, ముఖ్యంగా రత్నాలు, ఆభరణాల రంగంలో ఆసక్తి రేపుతోంది.
ఈ సమావేశంలో పన్ను కోతలు, వినియోగదారుల ప్రయోజనాలు ప్రధాన అంశాలుగా చర్చలు సాగుతాయనే ఊహాగానాలు మొదలయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే నిర్మాణాత్మక సంస్కరణలు, రేటు హేతుబద్ధీకరణ, జీవన సౌలభ్యం మీద దృష్టి సారించాలని సూచించారు. బంగారం ఎప్పుడూ భారతీయులకు పెట్టుబడి, ఆభరణాల రూపంలో భాగంగా ఉంది.బంగారు కడ్డీలు, నాణేలు, బిస్కెట్లు, ఆభరణాలపై 0.5-1 శాతం జీఎస్టీ తగ్గింపు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇది వినియోగదారుల డిమాండ్‌ను పెంచి,Gold ధరలను కొంతవరకు తగ్గించే అవకాశం ఉంది. ముఖ్యంగా దీపావళి వంటి పండుగలు, వివాహ సీజన్ ముందు ఈ మార్పు జరిగితే మార్కెట్‌కు పెద్ద ఊతం లభిస్తుంది.
ప్రస్తుతం బంగారంపై 3 శాతం జీఎస్టీ (1.5% CGST + 1.5% SGST) అమల్లో ఉంది. జూలై 2016లో జీఎస్టీ అమలు చేయక ముందు 1% VAT + 1% సేవా పన్ను ఉండేది. ఉదాహరణకు రూ. లక్ష విలువైన బంగారం కొనుగోలు చేస్తే రూ. 3 వేలు జీఎస్టీ పడుతుంది. తయారీ ఛార్జీలపై అదనంగా 5 శాతం జీఎస్టీ ఉంటుంది. ఉదాహరణకు రూ.15 వేలు తయారీ ఛార్జీలపై రూ. 750 జీఎస్టీ చెల్లించాలి. ఆభరణాల మరమ్మత్తు సేవలకూ ఇదే రేటు వర్తిస్తుంది. కాబట్టి 1శాతం జీఎస్టీ తగ్గితే వినియోగదారులకు ప్రత్యక్షంగా రూ. 1,000 పొదుపు లభిస్తుంది.
గత నెలలో బంగారం ధరలు పెరుగుదలతోనే కనిపించాయి. ఆగస్టు 8న 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 1,03,310 వద్ద ఆల్‌టైమ్ హైను తాకింది. తరువాత కొద్దిగా సడలించినా, సంవత్సరం ప్రారంభం నుంచి డాలర్ పరంగా 28 శాతం రాబడిని బంగారం ఇచ్చింది. బలహీనమైన అమెరికా డాలర్, US ఫెడ్ రేటు తగ్గింపు అంచనాలు, ద్రవ్యోల్బణ భయాలు, అంతర్జాతీయ సుంకాల పరిణామాలు ధరల కదలికపై ప్రభావం చూపాయి.
దీపావళి, దసరా, వివాహ సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో ఆభరణాల మార్కెట్ డిమాండ్ పుంజుకుంటోంది. ఇటీవల జరిగిన ఇండియా ఇంటర్నేషనల్ జ్యువెలరీ షో (IIJS)లో రిటైలర్లు ఊహించిన దానికంటే ఎక్కువ ఆర్డర్లు నమోదు చేశారు. గతంలో జాగ్రత్తగా వ్యవహరించిన వ్యాపారులు ఇప్పుడు పండుగ అమ్మకాలపై నమ్మకంతో నిల్వలు పెంచుతున్నారు. తయారీదారులు తేలికపాటి బరువుతో ఆభరణాలపై దృష్టి పెట్టి వినియోగదారులను ఆకర్షిస్తున్నారు. ఇదే సమయంలో బంగారు కడ్డీలు, నాణేల పెట్టుబడి డిమాండ్ బలంగా కొనసాగుతోంది.
జీఎస్టీ రేటు తగ్గింపు వినియోగదారులకు ఊరటనిచ్చినా.. ప్రభుత్వానికి ఆదాయ సవాళ్లు తలెత్తే అవకాశం ఉంది. అయితే వినియోగదారుల వ్యయం పెరగడం వల్ల దీని ప్రభావం కొంత సమతుల్యం కావచ్చని నిపుణులు అంచాన వేస్తున్నారు. సెప్టెంబర్ లో జరగనున్న సమావేశంలో జీఎస్టీ తగ్గింపు జరిగితే.. పండుగ సీజన్‌లో వినియోగదారులకు ఇది పెద్ద వరంగా మారే అవకాశం ఉంది.ఫలితంగా, ఈ పండుగ సీజన్‌లో ఆభరణాల మార్కెట్ మరింతగా బలపడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి
































