కొన్నేళ్లుగా మధుమేహ చికిత్సల్లో అనూహ్య మార్పులు వస్తున్నాయి. ఇన్సులిన్ ఒక్కటే కాకుండా, గ్లూకగాన్ లైక్ పెప్టైడ్-1 (జీఎల్‌పీ-1) అనే కొత్తరకం ఇంజెక్షన్ మందులు ఆపద్బాంధవుడిలా ఉపయోగ పడుతున్నాయి.
వీటిని వారానికి ఒకసారి తీసుకుంటే చాలు. మందు మోతాదులనూ నెలకు ఒకసారే మార్చుకోవచ్చు. ఇవి గ్లూకోజును మాత్రమే కాదు.. మధుమేహంతో ముడిపడిన దుష్ప్రభావాలనూ తగ్గిస్తుండటం గమనార్హం. బరువును తగ్గించటమూ అదనపు ప్రయోజనం. దీంతో కొందరు ఊబకాయం తగ్గటానికీ వాడుతున్నారు. అయితే వీటితో కొన్ని దుష్ప్రభావాలు లేకపోలేదు. కాబట్టి ఆచితూచి వాడటం, తగు జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరి.
జీఎల్‌పీ మందులు ఇన్సులిన్ విడుదలను ఇనుమడింప జేయటం, గ్లూకగాన్ ఉత్పత్తి నియంత్రించటం, ఆకలి తగ్గించటం, పేగుల్లోంచి ఆహారాన్ని నెమ్మదిగా ఖాళీ చేయటం ద్వారా గ్లూకోజు అదుపులో ఉండేలా చూస్తాయి. ఇంతకుముందు మనదగ్గర డ్యులాగ్లుటైడ్ ఒక్కటే ఉండేది. ఇటీవల సెమాగ్లుటైడ్, టిరిజెపటైడ్ సైతం వచ్చాయి. ఇవి వెంటనే వాడకంలోకి రావటం విశేషం. మరో రెండు మూడేళ్లలో కాగ్రిలినిటైడ్, రెటాట్రుడైడ్ వంటివీ వచ్చే అవకాశముంది. జీఎల్‌పీ ఇంజెక్షన్లతో మంచి ఫలితాలు కనిపిస్తున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే ప్రపంచదేశాల ఆరోగ్య మార్గనిర్దేశాలలో ఇవీ భాగమయ్యాయి. మధుమేహం బయటపడినప్పటి నుంచే వీటిని ఆరంభించాలని భావిస్తున్నారు కూడా.
ఒక్క గ్లూకోజే కాదు
మధుమేహ చికిత్స ప్రధాన ఉద్దేశం దీర్ఘకాల వాపుప్రక్రియ (క్రానిక్ ఇన్‌ఫ్లమేషన్)తో తలెత్తే ముప్పు కారకాలను తగ్గించటం. రక్తంలో గ్లూకోజు ఒక్కటే కాదు.. దీని కన్నా శరీర బరువు, రక్తపోటు, రక్తంలో కొవ్వు పదార్థాలు (కొలెస్ట్రాల్, ఎల్‌డీఎల్, ట్రైగ్లిజరైడ్లు, లైపో ప్రోటీన్ ఎ) మన ఆరోగ్యాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తుంటాయి. యూరిక్ ఆమ్లం, హోమోసిస్టిన్, వాపు ప్రక్రియను ప్రేరేపించే సైటోకైన్స్ (కొవ్వు కణాలు, తెల్ల రక్త కణాలను తయారుచేసేవి) కూడా తక్కువవేమీ కావు. ఇలా మనకు తెలిసిన, తెలియని ఎన్నో ముప్పు కారకాలను జీఎల్‌పీ మందులు తగ్గిస్తుండటం గమనార్హం. మరో ముఖ్య ఉపయోగం- రక్తంలో గ్లూకోజు మామూలుగా ఉన్నా.. ఆ మాటకొస్తే అసలు మధుమేహమే లేకపోయినా కూడా వీటిని వాడుకునే వీలుండటం. ఎందుకంటే ఇవి గ్లూకోజును ఉండాల్సిన పరిమాణం కన్నా తగ్గించవు. అంటే కొన్ని మధుమేహ మందులతో తలెత్తే హైపోగ్లైసీమియా (గ్లూకోజు మరీ తక్కువకు పడిపోవటం) వీటితో రాదన్నమాట. అందువల్ల మధుమేహం లేనివారిలోనూ దీర్ఘకాల వాపు ప్రక్రియతో కలుగుతున్న ఆరోగ్య సమస్యల నివారణ, చికిత్సలకూ ఈ మందులను వాడుకోవచ్చు.
మధుమేహ సమస్యలు తగ్గుముఖం
మధుమేహ చికిత్స పద్ధతుల్లో రక్తనాళాలు, నాడీ సమస్యలను అరికట్టటానికి చాలా ప్రాధాన్యమిస్తారు. గుండెపోటు, గుండె వైఫల్యం, పక్షవాతం, కిడ్నీ జబ్బు, పాదాల వేళ్లు కుళ్లిపోవటం (గ్యాంగ్రీన్), అరికాళ్ళలో మంట, పాదాల్లో తిమ్మిర్లు, కాళ్ల నొప్పులు (న్యూరోపతీ) నివారించటానికీ జీఎల్‌పీ మందులు తోడ్పడుతున్నాయనీ పరిశోధనల్లో నిరూపితమైంది. మధుమేహం ఉన్నా, లేకపోయినా కాలేయంలో కొవ్వు పేరుకోవటం (ఫ్యాటీ లివర్), కాలేయ క్యాన్సర్ ముప్పు, నిద్రలో కాసేపు ఊపిరి ఆగటం (స్లీప్ అప్నియా), నడి వయసులోనే మతిమరుపు (షార్ట్ మెమరీ లాస్, అల్జీమర్స్ మొదటి దశ), యుక్తవయసు మహిళలల్లో అండాశయాల్లో నీటి తిత్తులు (పీసీఓడీ) వంటి సమస్యలకూ వీటితో మంచి ఫలితం కనిపిస్తున్నట్టు తేలటం గమనార్హం.
దుష్ప్రభావాలతో జాగ్రత్త
జీఎల్‌పీ మందులతో ప్రయోజనాలే కాదు, కొన్ని దుష్ప్రభావాలూ ఉంటున్నాయి. వీటితో కొందరికి ఛాతీలో, కడుపులో మంట, తేన్పులు, వికారం, అప్పుడప్పుడూ వాంతులు, కడుపు నొప్పి, పొట్ట ఉబ్బరం, అజీర్ణం, విరేచాలు అవటం లేదా మల బద్ధకం లాంటి ఇబ్బందులు పొడసూపొచ్చు. అలాగని అంతగా భయపడాల్సిన పనిలేదు. డాక్టర్ల సలహాతో తగు మందులు వాడుతూ, ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుంటే తొలి రెండు, మూడు నెలల్లోనే వీటిని తగ్గించుకోవచ్చు. జీఎల్‌పీ మందుల మోతాదులను తెలుసుకొని, ఆయా వ్యక్తులకు అనుగుణంగా సవరించుకోవటమూ మేలు చేస్తుంది. సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్ అయితే 0.25 మి.గ్రా. నుంచి 2.4 మి.గ్రా. వరకు.. టిరిజెపటైడ్‌ను 2.5 మి.గ్రా. నుంచి 15 మి.గ్రా. వరకూ ఇవ్వచ్చు. వీటిని ముందు కొద్ది మోతాదులో ఆరంభించి, ప్రతి నెలా కొద్దికొద్దిగా పెంచుతూ మందు మోతాదులను నిర్ణయించాల్సి ఉంటుంది. సరిపడిన మోతాదుల్లో నెలల తరబడి ఇంజెక్షన్లు వాడుకున్నా పెద్దగా ఆరోగ్య సమస్యలేమీ ఉండవనే చెప్పుకోవచ్చు.
ఇవి మనలోనే ఎక్కువ
జీఎల్‌పీ మందుల ప్రతికూల ప్రభావాలు ప్రత్యేకించి మన భారతీయుల్లోనే కనిపిస్తుండటం గమనార్హం. జీర్ణాశయం, చిన్నపేగు, పెద్దపేగుల్లో ఇవి మరింత ఎక్కువగా తలెత్తుతున్నాయి. దీనికి చాలావరకూ మన ఆహార అలవాట్లే కారణం. ఉప్పు, కారం, పులుపు, వేపుళ్లు (నూనెలో ముంచి వేయించేవి, ఒకసారి వండిన తర్వాత మళ్లీ మళ్లీ వేడి చేసి తినేవి), మసాలాలను మనమే ఎక్కువగా వాడుతుంటాం. మన వంట దినుసులతో, మన పద్ధతుల్లో వండిన ఇలాంటి ఆహారాన్ని జీఎల్‌పీ మందులు వెంటనే జీర్ణం కాకుండా అడ్డుకుంటాయి. జీర్ణాశయంలో, పేగుల్లో గంటల తరబడి నిల్వ ఉండేలా చేస్తాయి. వీటితో పెద్దగా ఇబ్బందేమీ ఉండదు గానీ ఇంజెక్షన్ తీసుకున్న రోజు, మర్నాడు కొంత చికాకు.. ఇంటా బయటా పనులు చేసుకోవటంలో కొన్ని సమస్యలు తలెత్తొచ్చు. ఇవి వారంలో అన్ని రోజులు ఉండకపోవచ్చు కూడా. కారం, వేపుళ్లు, మసాలాలతో పాటు ఉప్పు, పులుపూ తగ్గించుకుంటే వీటిని చాలావరకూ నివారించు కోవచ్చు.
జీర్ణక్రియ వ్యత్యాసాలతోనూ..
అందరిలోనూ.. ముఖ్యంగా మన భారతీయుల్లో ఆహారం ఒకేలా జీర్ణమవదు. ఎవరికివారే ప్రత్యేకం. మధ్యవయసువారిలో, వృద్ధుల్లో వ్యత్యాసాలు మరీ ఎక్కువ. దీనికి చిన్నప్పటి ఆహార అలవాట్లు, మనకు అందుబాటులో ఉండే, లేని ఆహారాలు ఒక కారణమైతే.. మిగతా దేశాల్లో లేనంత జన్యు వైవిధ్యం మరో కారణం. జీఎల్‌పీ మందులు తీసుకునేవారిలో ఇదే ప్రాధాన్యత సంతరించుకుంటోంది. అందుకే వీటి మోతాదు సురక్షిత (సేఫ్టీ), తట్టుకునే సామర్థ్యం (టోలరేబిలిటీ), దుష్ప్రభావాల (యాడ్‌వర్స్ ఈవెంట్స్) మీద భారతీయులపై ప్రత్యేకంగా ప్రయోగ పరీక్షలు నిర్వహించి శాస్త్రవేత్తలు పూర్తి సమాచారాన్ని సేకరించారు. ఏయే పదార్థాలు ఎవరికీ సరిపోతున్నాయో, అదే ఆహారం ఎవరికి సమస్యలను సృష్టిస్తుందో అనేది ఎవరికివారే తెలుసుకోవటానికి కొన్ని మార్గదర్శకాలు, సూచనలూ చేశారు.
ఇవీ జాగ్రత్తలు
- కడుపులో మంట, తేన్పులు, తిన్న ఆహారం గొంతులోకి ఎగదన్నుకు రావటం, వికారం, వాంతులతో ఇబ్బంది పడేవారు- ఒకేసారి ఎక్కువగా తినకుండా, రెండు మూడు సార్లు కొద్దికొద్దిగా తినాలి. తొందర పడకుండా నెమ్మదిగా నమిలి తినాలి. ఎక్కువ నూనె వాడొద్దు. వేపుళ్లు, చట్నీలు, పచ్చళ్ల వంటివి మానెయ్యాలి. సిగరెట్లు, మద్యం, శీతల పానీయాలు (కార్బోనేటేడ్) పూర్తిగా మానెయ్యటమే మంచిది. మంట, తేన్పులు తగ్గటానికి డాక్టర్ల సలహాతో హెచ్ 2 బ్లాకర్ లేదా ప్రోటాన్ పంప్ ఇన్‌హిబిటార్ రకం మందులు వాడుకోవచ్చు. మరీ ఎక్కువగా వికారం లేదా వాంతులు ఉంటే ఆండన్సెట్రాన్ వంటి స్వల్పకాలిక యాంటీఎమెటిక్స్ వేసుకోవచ్చు.
- జీర్ణాశయం, పేగుల కదలికలు మందగించటం వల్ల మలబద్ధకం గలవారు- ఆహారంలో తగినంత పీచు పదార్థం ఉండేలా చూసుకోవాలి. నీళ్లు ఎక్కువగా తాగాలి. సిలియం, డోకుసేట్ సోడియం, పాలిథిలిన్ గ్లైకాల్ వంటి మందులు వాడితే మలవిసర్జన సాఫీగా జరుగుతుంది. అయితే అప్పుడప్పుడూ ఎక్కువసార్లు మలవిసర్జనకూ వెళ్లాల్సి రావచ్చు. నీళ్ల విరేచనాలయ్యే అవకాశం తక్కువే గానీ రోజుకు మూడు నాలుగు సార్లు మలవిసర్జన అవుతుంటే లోపరమైడ్ వాడుకోవచ్చు. డాక్టర్ల సలహా తీసుకొని వీటిని ముందుగానే ఇంట్లో ఉంచుకోవటం మంచిది.
కొన్ని ఆరోగ్య సమస్యలు
అరుదే అయినా జీఎల్‌పీ మందులతో కొన్ని తీవ్ర సమస్యలు తలెత్తొచ్చు. దీర్ఘకాలంగా అజీర్ణం, మలబద్ధకం మూలంగా పేగుల్లో అడ్డంకి తలెత్తొచ్చు. దీంతో కడుపు నొప్పి, ఉబ్బరం వేధించొచ్చు. ఆహారం ఎక్కువసేపు పేగుల్లోనే ఉండిపోవటం వల్ల అది కుళ్లిపోయి బ్యాక్టీరియా వంటి సూక్ష్మక్రిముల సంఖ్య పెరగొచ్చు. ఫలితంగా పొట్టలో చెడు వాసనతో కూడిన వాయువులు చేరి, పోషకాహార లోపానికి దారితీయొచ్చు.
- థైరాయిడ్ గ్రంథిలో కణితులు, క్లోమం వాపు, పిత్తాశయంలో రాళ్లు, కిడ్నీ రాళ్లు, చూపు దెబ్బతినటం తలెత్తొచ్చు.
- మత్తుమందులు వాడి పెద్ద శస్త్రచికిత్సలు చేసే సమయంలో జీర్ణంకాని ఆహారం పొట్టలోంచి నోటిలోకి వచ్చి, ఊపిరితిత్తుల్లోకి వెళ్లొచ్చు (రిగర్జిటేషన్). ఇది ప్రాణాపాయం కలిగించొచ్చు.
- డాక్టర్ సలహా మేరకు ఆరు నెలలకోసారి రక్త, స్కాన్, కంటి పరీక్షలు చేయించుకుంటే ప్రమాదకర సమస్యల్ని ముందే గుర్తించి చికిత్స చేయటానికి అవకాశముంటుంది.
పీచు అవసరమే గానీ..
ఒకింత విరుద్ధంగా అనిపించినా జీఎల్‌పీ మందులతో జీర్ణ సమస్యలు గలవారు ఆహారపరంగా ప్రత్యేకించి మరికొన్ని జాగ్రత్తలూ తీసుకోవాలి. పీచు పదార్థం ఎక్కువగా తీసుకుంటే కొందరికి జీర్ణక్రియ నెమ్మదించి చాలారకాల చెడు వాయువులు (గ్యాస్) పొట్టలో విడుదలవ్వచ్చు. తినే సమయంలో నీళ్లు తాగితే గాలి ఎక్కువగా కడుపులోకి చేరి పొట్ట ఉబ్బొచ్చు. తేలికగా జీర్ణంకాని గింజలు, క్యాబేజీ, గోబీ, బ్రోకలీ వంటివి.. పచ్చి కాయగూరలు, సలాడ్‌లు, కఠిన పిండి పదార్థాలతో కూడిన తృణధాన్యాలూ అజీర్ణ సమస్యకు దారితీయొచ్చు. పాలలోని లాక్టోజ్ పడనివారికి జీర్ణ సమస్యలు మరింత ఎక్కువ కావొచ్చు. కాబట్టి ఇలాంటి వాటిపై జాగ్రత్త అవసరం.
వ్యాయామమూ ముఖ్యమే
జీఎల్‌పీ మందులు వాడేవారిలో కొన్ని నెలల తర్వాత ఎముకలు పలుచగా (ఆస్టియోపీనియా), కండరాలు బలహీనంగా (సార్కోపీనీయా) అవ్వచ్చు. వీటి నివారణకు వారానికి కనీసం రెండు రోజులైనా కండరాలను బలోపేతం చేసే వ్యాయామాలు చేయాలి. అలాగే వీళ్లు ఆహారంలో మాంసకృత్తులు ఎక్కువగా తీసుకోవాలి. రోజుకు ఒక కిలో శరీర బరువుకు 1.3 గ్రాముల ప్రోటీన్ అవసరం. శాకాహారులు ఆహారంతో లభించే మాంసకృత్తులు చాలకపోతే ప్రోటీన్ పౌడర్లు తీసుకోవచ్చు.
































