దూకుడు పెంచిన యాపిల్‌ కంపెనీ.. ఇండియాలో నాలుగో స్టోర్‌! ఎక్కడంటే

మన దేశంలో యాపిల్ తన నాలుగవ రిటైల్ స్టోర్ సెప్టెంబర్ 4న ప్రారంభం కానుంది. అంతేకాకుండా రానున్న ఐఫోన్ 17 మోడళ్లను భారతదేశంలోనే తయారు చేయాలని యాపిల్ నిర్ణయించింది. ఇది చైనాపై ఆధారపడటాన్ని తగ్గించి, అమెరికా ఎగుమతులపై టారిఫ్ ప్రమాదాలను తగ్గించడానికి నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఇండియాలో యాపిల్‌ ఫోన్ల తయారీని నిలిపివేయాలని ఒక వైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నుంచి ఆ కంపెనీకి ఒత్తిడి వస్తున్నా.. యాపిల్‌ కంపెనీ మాత్రం భారత్‌లో తన కార్యకలాపాలను మరింత దూకుడుగా విస్తరిస్తోంది. తాజాగా మన దేశంలో నాలుగో స్టోర్‌ను ప్రారంభించనున్నట్లు యాపిల్‌ కంపెనీ తెలిపింది. భారత్‌లో తయారీ, విక్రయ కార్యకలాపాలను వేగంగా విస్తరిస్తున్న యాపిల్‌ నాలుగో యాపిల్ స్టోర్‌ను ఏర్పాటుచేయనున్నట్లు మంగళవారం ప్రకటించింది. మహారాష్ట్రలోని పుణెకు చెందిన కొరెగావ్ పార్క్‌లో సెప్టెంబర్ 4న దీనిని ప్రారంభించనుంది.


అలాగే స్టోర్‌కు సంబంధించిన గ్రాఫిక్స్‌ను కూడా విడుదల చేసింది. బెంగళూరులోని స్టోర్ మాదిరిగానే పుణెలోని స్టోర్‌ను కూడా నెమలి కళాకృతితో తీర్చిదిద్దారు. ఈ స్టోర్‌ 10వేల చదరపు అడుగుల వైశాల్యంలో విస్తరించి ఉంటుందని సమాచారం. కొత్త ఐఫోన్ 17 లాంచ్‌ కానున్న నేపథ్యంలో ఈ ప్రారంభంపై ప్రకటన వచ్చింది. ఇప్పటికే ముంబయి, దిల్లీ, బెంగళూరులో స్టోర్లు ఉన్నాయి. భారత్‌లో వ్యాపార వృద్ధికి ఇంకా భారీ అవకాశాలున్నాయని గతంలో వ్యాఖ్యానించిన యాపిల్‌ సీఈఓ టిమ్‌కుక్‌.. అందుకు అనుగుణంగా దేశంలో నాలుగు రిటైల్‌ స్టోర్లు నెలకొల్పుతామని చెప్పిన సంగతి తెలిసిందే.

త్వరలో విడుదల కాబోయే ఐఫోన్ 17 మోడళ్లన్నింటినీ దేశంలోనే తయారుచేయాలని యాపిల్‌ కంపెనీ నిర్ణయించింది. చైనా మీద ఆధారపడడాన్ని తగ్గించి, అమెరికాకు ఎగుమతులపై టారిఫ్‌ రిస్క్‌లను తప్పించుకోవడానికి యాపిల్‌ ఈ వ్యూహాత్మక ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే భారత్‌ నుంచి అమెరికాకు ఐఫోన్‌ ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. యాపిల్ రాబోయే అన్ని ఐఫోన్‌ 17 మోడళ్లను భారత్‌లోని ఐదు ప్లాంట్లలో చేపట్టనుంది.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.