జన ఔషధి స్టోర్లను బీసీ యువతకు ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు.
బీసీ కార్పొరేషన్ నుంచి పెద్దఎత్తున వచ్చిన దరఖాస్తులను పరిశీలించి.. ఏర్పాటుకు తక్షణమే అనుమతులివ్వాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో వైద్య సదుపాయాల మెరుగుదల, ఆరోగ్య బీమాలో మార్పులు, కొత్త వైద్య కళాశాలలు, ఉచితంగా వైద్య పరీక్షలు, యోగా-నేచురోపతి అభివృద్ధి వంటి అంశాల్లో తీసుకోవాల్సిన చర్యలపై సోమవారం సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్షించారు. ప్రతి మండలంలో జనరిక్ ఔషధాలు లభించేలా చూడాలన్న సీఎం ఆలోచనకు అనుగుణంగా అధికారులు ప్రతిపాదనలు సూచించడంతో.. వాటికి వెంటనే ఆమోదం తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవ కింద రూ.25 లక్షల వరకూ వైద్య బీమా అందించే అంశంపైనా చర్చించారు. ప్రస్తుత విధానం ద్వారా 1.43 కోట్ల కుటుంబాలకు లబ్ధి కలుగుతుండగా, 1.63 కోట్ల కుటుంబాలకు వర్తించేలా మార్పులు చేయాలని సీఎం సూచించారు. ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రిని నిర్మించేలా ప్రణాళిక అమలుచేయాలని సీఎం సూచించారు. మార్కాపురం, మదనపల్లి, పులివెందుల, ఆదోనిలో నిర్మిస్తున్న మెడికల్ కాలేజీల పురోగతిపై చర్చించారు. డబ్ల్యూహెచ్‌వో నిర్దేశాల ప్రకారం రాష్ట్రంలో మరో 12,756 పడకలు అందుబాటులోకి తేవాల్సి ఉందని, దీనిపై సమగ్ర అధ్యయనం చేయాలని సూచించారు. మూడు రీజనల్ స్టడీ సెంటర్లలో 64 మంది సభ్యుల నియామకానికి అనుమతులిచ్చారు. అమరావతి పరిధిలో నేచురోపతి యూనివర్సిటీ ఏర్పాటుకు యాక్షన్‌ప్లాన్ సిద్ధం చేయాలన్నారు. రాష్ట్రంలో ప్రతిఒక్కరి హెల్త్ ప్రొఫైల్‌ను రూపొందించేందుకు తలపెట్టిన ఉచిత వైద్య పరీక్షల పైలెట్ ప్రాజెక్టును కుప్పం నియోజకవర్గంలో 45రోజుల్లో పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. 108 వాహనాల సిబ్బందికి యూనిఫామ్ అమలు చేయాలని నిర్దేశించారు. ఎన్టీఆర్ బేబీ కిట్స్ పథకాన్ని త్వరలోనే అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
మోడల్ ఇన్‌క్లూజివ్ సిటీ ఏర్పాటు చేస్తాం
సమీక్షలో భాగంగా పెర్కిన్స్ ఇండియా, ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్‌లు భాగస్వామ్యంతో అమరావతిలో మోడల్ ఇన్‌క్లూజివ్ సిటీ ఏర్పాటుకు ముందుకొచ్చాయి. దీనిపై ఆ సంస్థల ప్రతినిధులు సీఎంను కలిసి ప్రజంటేషన్ ఇచ్చారు. ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా సమగ్ర విద్య, సమాన హక్కులు, అందరికీ అందుబాటులో మౌలిక వసతులు సృష్టించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు. స్పందించిన సీఎం చంద్రబాబు సమగ్ర కార్యాచరణ ప్రణాళిలతో రావాలని సూచించారు. సమీక్షలో ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, ప్రత్యేక సీఎస్ ఎం.టి.కృష్ణబాబు ఇతర అధికారులు పాల్గొన్నారు.
- ప్రజారోగ్య రంగంలో ఆవిష్కరణలకు ‘బ్రెయిన్’
- బయోడిజైన్ నిపుణులతో సీఎం సమావేశం
- పరిశోధనలు, శిక్షణ, స్టార్టప్‌ల కోసం ఎంవోయూ
వైద్య ఆరోగ్య రంగంలో వినూత్న ఆవిష్కరణల కోసం భారత్ బయోడిజైన్ రిసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ (బీఆర్‌ఐఏఎన్-బ్రెయిన్) కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. సోమవారం సచివాలయంలో ఆసియా పసిఫిక్ బయోడిజైన్ అలయన్స్‌కు చెందిన వివిధ దేశాల వైద్య నిపుణులతో సీఎం సమావేశమయ్యారు. అమరావతిలోని రతన్‌టాటా ఇన్నోవేషన్ హబ్‌లో అంతర్భాగంగా ఈ రిసెర్చ్ ఇన్నోవేషన్ కార్యకలాపాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఏఐ, మెడ్‌టెక్ అలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆసియా-పసిఫిక్ బయోడిజైన్ అలయన్స్, అమెరికాలోని ప్రతిష్ఠాత్మక స్టాన్‌ఫోర్డ్ బయోడిజైన్ సంయుక్త భాగస్వామ్యంలో దీనిని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. అనంతరం ఏపీని వైద్య రంగంలో ఆవిష్కరణలు మెడ్‌టెక్ పరిశోధనలకు కేంద్రంగా అభివృద్ధి చేయాలనే రోడ్‌మ్యాప్‌పై సీఎం చర్చించారు. వైద్యారోగ్య రంగంలో పరిశోధన, శిక్షణ, సాంకేతికత బదిలీ, స్టార్టప్, ఇంక్యుబేషన్ తదితర రంగాల్లో సహకారంపై అంతర్జాతీయ నిపుణులు, రాష్ట్ర ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం కుదరింది. ఇందులో భాగంగా భారత్ బయోడిజైన్-బయోడిజైన్ ఆస్ట్రేలియా కలిసి పనిచేయనున్నాయి.
































