ఎలన్ మస్క్‌కు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్‌ఎక్స్ అత్యంత భారీ రాకెట్ ‘స్టార్‌షిప్’ను బుధవారం ప్రయోగించింది. ఇప్పటి వరకు స్పేస్ ఎక్స్ ప్రయోగించిన 10వ రాకెట్ ఇది.
స్టార్‌షిప్ విజయవంతంగా ప్రయోగించినప్పటికీ, సూపర్ హెవీ బూస్టర్ తిరిగి భూమికి వచ్చే క్రమంలో సముద్రంలో కూలిపోయింది. ఈ ప్రయోగం టెక్సాస్‌లోని స్టార్‌బేస్ నుంచి జరిగింది. ఈ ప్రయోగం పూర్తి విజయవంతం కాకపోయినప్పటికీ, స్పేస్‌ఎక్స్ దీనిని ఒక ముఖ్యమైన పురోగతిగా భావిస్తోంది. స్పేస్‌ఎక్స్ సంస్థ ఒకసారి ప్రయోగించిన స్టార్‌షిప్ రాకెట్‌ని తిరిగి వాడే విధంగా తయారు చేయాలనుకుంది. దానికి ఈ ప్రయోగం ఓ ముఖ్యమైన అడుగు అని ఆ సంస్థ పేర్కొంది.
ప్రయోగంలో భాగంగా, స్టార్‌షిప్ రాకెట్ బూస్టర్ నుంచి విజయవంతంగా విడిపోయిన తర్వాత, భూమికి తిరిగివచ్చేటప్పుడు నియంత్రణ కోల్పోయినట్లు స్పేస్‌ఎక్స్ ప్రకటించింది. రాకెట్ కంట్రోల్ తప్పి తిరుగుతూ హిందూ మహాసముద్రంలో పడిపోయినట్లు భావిస్తున్నారు. అయితే, ఇది ఈ ప్రయోగంలో ఓ ప్లానే అని స్పేస్‌ఎక్స్ తెలిపింది. ఈ ప్రయోగంతో వాతావరణంలోకి తిరిగి ప్రవేశించే సమయంలో రాకెట్ పనితీరుపై కీలక సమాచారం సేకరించగలిగారు.
గతంలో జరిగిన ప్రయోగాల కంటే ఇది మెరుగైన ఫలితాలు ఇచ్చిందని, రాకెట్ వాతావరణంలోకి తిరిగి ప్రవేశించడం, నియంత్రణ వ్యవస్థలపై మరింత స్పష్టత వచ్చిందని సంస్థ అధికారులు వివరించారు. ఈ ప్రయోగంలో వచ్చిన డేటా భవిష్యత్తులో మరింత సక్సెస్ రేటుకు ఉపయోగడుతుందని వారు తెలిపారు. స్టార్‌షిప్ రాకెట్ చంద్రుడు, అంగారకుడిపైకి వ్యోమగాములను, భారీ పరికరాలను చేరవేసేందుకు రూపొందించబడింది. అందువల్ల, ఈ ప్రయోగంలో ఎదురైన చిన్నపాటి వైఫల్యాలు భవిష్యత్తులో పూర్తిస్థాయి విజయానికి కీలకంగా మారతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
































