మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధిగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం పలు పథకాలు తీసుకొస్తోంది. దానిలో అత్యంత ప్రజాదరణ పొందిన పథకం స్టాండప్ ఇండియా. ఈ పథకం ద్వారా సొంత వ్యాపారం చేయాలనుకునే వారు, ఇప్పటికే చిన్న వ్యాపారం నడిపే మహిళలు, అలాగే ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన వారు ఇకపై నేరుగా ప్రయోజనం పొందవచ్చు. వ్యాపారం ప్రారంభించడానికి లేదా విస్తరించడానికి రూ.10 లక్షల నుంచి రూ.1 కోటి వరకు రుణం తీసుకునే అవకాశం ఇస్తోంది.
ఈ పథకం ప్రారంభమైన దగ్గరి నుంచి ఇప్పటి వరకు దాదాపు 2.75 లక్షల మందికి రుణాలు మంజూరు చేశారు. ఇందులో మొత్తం రూ.62,791 కోట్లు వేరు వేరు బ్యాంకుల ద్వారా విడుదల చేసినట్లు కేంద్రం పార్లమెంట్లో ప్రకటించింది. 2016 ఏప్రిల్ 5న ఈ పథకం అధికారికంగా మొదలైంది. ఈ తొమ్మిది ఏళ్లల్లో లక్షలాది మంది మహిళలు, ఎస్సీ, ఎస్టీ వర్గాలు దీని ద్వారా తమ కలలను నిజం చేసుకున్నారు.
స్టాండప్ ఇండియా పథకం ప్రధాన ఉద్దేశం మహిళలను వ్యాపార రంగంలోకి తీసుకురావడం. మన దేశంలో చాలా మంది మహిళలు ప్రతిభ ఉన్నప్పటికీ పెట్టుబడి లేక వ్యాపారం ప్రారంభించలేక వెనుకబడిపోతున్నారు. అలాంటి వారికి ఈ స్కీమ్ బంగారు బాట. గ్రీన్ ఫీల్డ్ ఎంటర్‌ప్రైజెస్, మాన్యుఫాక్చరింగ్ యూనిట్లు, సర్వీసులు, వ్యవసాయ అనుబంధ రంగాలు – ఇవన్నీ ఈ రుణంతో ప్రారంభించవచ్చు.
రుణం పొందాలంటే :
- మహిళలు లేదా ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన వారు కనీసం 18 ఏళ్ల వయసు పూర్తి చేసి ఉండాలి.
- మీ వ్యాపారం కోసం మీరు 10-15 శాతం పెట్టుబడి పెట్టాలి. మిగతాదంతా బ్యాంకు ద్వారా రుణంగా వస్తుంది.
- ఈ రుణంలో ప్రత్యేకత ఏమిటంటే, మొదటి 18 నెలలు మీకు ఎటువంటి చెల్లింపులు చేయాల్సిన అవసరం లేదు. దాన్ని మారటోరియం అంటారు. అంటే వ్యాపారం బాగా స్థిరపడే వరకు మీపై భారముండదు.
- ఆ తర్వాత 7 సంవత్సరాల లోపు సులభ వాయిదాల్లో చెల్లించవచ్చు. ఒక షరతు మాత్రం ఉంటుంది. వ్యాపారంలో కనీసం 51 శాతం వాటా మహిళలు లేదా ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వ్యక్తుల పేరిట ఉండాలి.
- అలాగే గతంలో ఎలాంటి రుణం డీఫాల్ట్ చేయకుండా ఉండాలి. మీ సిబిల్ స్కోర్ బాగుండాలి. ఇవన్నీ ఉంటే రుణం పొందడంలో ఎలాంటి సమస్య ఉండదు.
- కేంద్రం ప్రకటించిన వివరాల ప్రకారం గత ఆర్థిక సంవత్సరంలో వేలాది మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు.
- మహిళలు, యువ పారిశ్రామిక వేత్తలు, రైతులు ఈ రుణంతో కొత్త వ్యాపారాలు ప్రారంభించి, సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అలాగే అదనంగా వ్యవసాయ రంగానికి సంబంధించి వడ్డీ సబ్సీడీ రూపంలో భారీగా సాయం అందిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
మీరు కూడా ఈ పథకంలో దరఖాస్తు చేయాలనుకుంటే అధికారిక వెబ్‌సైట్ www.standupmitra.in ద్వారా నేరుగా అప్లై చేసుకోవచ్చు. అక్కడ మీ వ్యక్తిగత వివరాలు, వ్యాపార ప్రణాళిక, పెట్టుబడి వివరాలు అందించాలి. ఆ తర్వాత బ్యాంక్ అధికారులు మీకు మార్గనిర్దేశం చేస్తారు. ఇప్పటి వరకు దాదాపు మూడు లక్షల మంది ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నారు.
































