పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో రాబోతున్న ‘స్పిరిట్’ మూవీపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి.
తన సినిమాలో స్టోరీతో పాటు క్యాస్టింగ్ పైనా సందీప్ వంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారన్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ సినిమాపై ఓ క్రేజీ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో ఓ అత్యంత కీలకమైన, పవర్ ఫుల్ పాత్ర కోసం మెగాస్టార్ చిరంజీవిని రంగంలోకి దించాలని సందీప్ వంగా గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
సందీప్ వంగా గత చిత్రం యానిమల్ లో అనిల్ కపూర్ పాత్ర చాలా కీలకంగా ఉంది. రణబీర్ కపూర్ తండ్రిగా అనిల్ కపూర్ నటించారు. అయితే స్పిరిట్ లోనూ ఓ శక్తివంతమైన పాత్రకోసం చిరంజీవితో సందీప్ వంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ మూవీలో ప్రభాస్ కు తండ్రిగా మెగాస్టార్ నటిస్తారని అభిమానులు సామాజిక మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు. యాంగ్రీ ఫాదర్ పాత్రలో చిరంజీవి కనిపిస్తారని.. సిన్సియర్ పోలీస్ పాత్రలో ప్రభాస్ నటిస్తారని నెట్టింట కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఈ పాత్ర కోసం విజయ్ సేతుపతి, సంజయ్ దత్ లనూ గతంలో సందీప్ వంగా సంప్రదించారట. కానీ మెగాస్టార్ చిరంజీవి అయితేనే ఈ పాత్రకు తగిన న్యాయం జరుగుతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. అటు చిరంజీవి ఇప్పటికే నాలుగు సినిమాలకు కమిట్ మెంట్ ఇచ్చారు. దీంతో ఈ కీ రోల్ కు ఆయన ఓకే చేస్తారా.. లేదా అని తెలియాల్సి ఉంది. ఒకవేళ ఈ కాంబినేషన్ కుదిరితే, బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు.. ప్రభాస్ ‘ది రాజాసాబ్’, ‘ఫౌజీ’ సినిమాల చిత్రీకరణ దాదాపు పూర్తయింది. దీంతో ‘స్పిరిట్’ కోసం ఆయన ఏకధాటిగా డేట్స్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ప్రభాస్ ఒక శక్తివంతమైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా ‘యానిమల్’ బ్యూటీ త్రిప్తి దిమ్రీని ఎంపిక చేసినట్లు ఇటీవల అధికారికంగా ప్రకటించారు. ఇక విలన్ పాత్ర కోసం ప్రముఖ కొరియన్ స్టార్ డాన్ లీని తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారు. ఇక ఈ మూవీలో వీరితో పాటు తరుణ్, శ్రీకాంత్, మడోన్నా సెబాస్టియన్ కీలక పాత్రల్లో నటించనున్నారని టాక్.
































