‘టీ20 ఫార్మాట్’ వచ్చాక క్రికెట్ ఆట స్వరూపమే మారిపోయింది. బ్యాటర్లు ఆకాశమే హద్దుగా ఆడుతున్నారు.
సిక్సులు, ఫోర్లతో విరుచుకుపడుతూ.. బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నారు. ఒక్కోసారి బ్యాటర్ల విద్వంసంకు బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు. ఒకే ఓవర్లో ఏకంగా 20 నుంచి 30 రన్స్ కూడా ఇచ్చుకుంటున్నారు. టీ20 ఫార్మాట్లో ఇది పెద్ద విషయం కాదు. అయితే ఒకే బంతికి 22 రన్స్ ఇచ్చుకోవడం మాత్రం సంచలనమే అని చెప్పాలి. ఈ ఘటన కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) 2025లో చోటుచేసుకుంది.
సీపీఎల్ 2025లో భాగంగా గయానా అమెజాన్ వారియర్స్, సెయింట్ లూసియా కింగ్స్ జట్ల మధ్య మంగళవారం రాత్రి డారెన్ సామీ నేషనల్ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ రొమారియో షెఫర్డ్ చెలరేగాడు. 34 బంతుల్లో 73 పరుగులు చేశాడు. అయితే 15వ ఓవర్లో బౌలర్ ఒషానే థామస్ వేసిన మూడో బంతికి ఏకంగా 22 పరుగులు పిండుకున్నాడు. మూడో బంతి నోబాల్ కాగా.. షెఫర్డ్ పరుగులేమీ చేయలేదు. ఫ్రీహిట్ వైడ్‌గా వెళ్లింది. తర్వాతి ఫ్రీహిట్‌ను షెఫర్డ్ సిక్స్‌గా మలిచాడు. అయితే ఆ బంతి కూడా నోబాలే. ఆ తర్వాతి బంతినీ సైతం షెఫర్డ్ సిక్స్‌గా బాదాడు.
ఇక్కడ దురదృష్టం ఏంటంటే.. ఒషానే థామస్ మరోసారి నోబాల్ వేశాడు. మూడో ఫ్రీహిట్నూ షెఫర్డ్ సిక్స్‌గా మలిచాడు. ఎట్టకేలకు థామస్ లీగల్ డెలివరీ వేసి నోబాల్‌లకు పులిస్టాప్ పెట్టాడు. 15వ ఓవర్లోని మూడో బంతికి మొత్తంగా 22 పరుగులు వచ్చాయి. 15వ ఓవర్లో మొత్తంగా 33 రన్స్ (నాలుగు సిక్సులు, ఒక ఫోర్) వచ్చాయి. ఇక థామస్ బౌలింగ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోకి లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. ‘క్రికెట్ చరిత్రలో అత్యంత ఖరీదైన డెలివరీ’ అని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో థామస్ తన నాలుగు ఓవర్ల కోటాలో 63 రన్స్ ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. థామస్ ఒక వైడ్, మూడు నోబాల్స్ వేశాడు.
































