ఫోన్‌పే సంచలనం.. రూ.181కే ఇంటికి బీమా

ప్రముఖ ఫిన్ టెక్ సంస్థ ఫోన్ పే సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా సరికొత్త హోం ఇన్సూరెన్స్ పాలసీని ప్రారంభించింది. కేవలం 181 రూపాయలు వార్షిక ప్రీమియంతోనే తమ ఇంటికి పూర్తి భద్రత కల్పించుకునే అవకాశాన్ని ఈ పాలసీ అందిస్తుంది.


ఫోన్ పే యాప్ ద్వారా ఎటువంటి పత్రాలు లేకుండా పూర్తిగా డిజిటల్ పద్ధతిలో నిమిషాల వ్యవధిలోనే ఈ పాలసీని పొందవచ్చు. ఈ బీమా పథకం కింద వినియోగదారులు తమ ఇంటికి 10 లక్షల నుంచి గరిష్టంగా 12.5 కోట్ల వరకు బీమా హామీని ఎంచుకోవచ్చు. ఇది కేవలం ఇంటి నిర్మాణానికే కాకుండా ఇంట్లోని ఫర్నిచర్, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, ఇతర విలువైన వస్తువులకు కూడా వర్తిస్తుంది. అగ్ని ప్రమాదం, వరదలు, భూకంపాలు, అల్లర్లు, దొంగతనం వంటి 20 కి పైగా ఊహించని నష్టాల నుంచి ఈ పాలసీ ఆర్థిక రక్షణ కల్పిస్తుంది. ఈ సందర్భంగా ఫోన్ పే ఇన్సూరెన్స్ బ్రోకింగ్ సర్వీసెస్ సిఇఒ విశాల్ గుప్తా మాట్లాడుతూ ప్రతి భారతీయుడికి బీమాను సులభంగా తక్కువ ఖర్చుతో అందుబాటులోకి తీసుకురావడమే మా లక్ష్యం.

సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల. వారి అత్యంత విలువైన ఈ ఆస్తులను కాపాడుకోవడానికి మా కొత్త గృహ బీమా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎలాంటి తనిఖీలు, దీర్ఘకాలిక పత్రాల ప్రక్రియ లేకుండానే వినియోగదారులు తమకు నచ్చిన పాలసీని ఆన్ లైన్ లో ఎంచుకోవచ్చు అని తెలిపారు. సాధారణంగా గృహ రుణాలతో పాటు వచ్చే బీమా పాలసీల ప్రీమియం ఎక్కువగా ఉండటంతో పాటు కొన్ని పరిమితులు ఉంటాయి. ఫోన్ పే ఈ సమస్యను అధిగమించి గృహ రుణం ఉన్న వారికే కాకుండా లేని వారికి కూడా ఈ సౌకర్యాన్ని అందిస్తుంది. అన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కూడా గృహ రుణాల కోసం ఈ పాలసీని అంగీకరిస్తాయని కంపెనీ స్పష్టం చేసింది. ఈ కొత్త విధానం గృహ యజమానులకు ఆర్థిక భద్రతను అందించడంలో కీలక ముందడుగుగా భావిస్తున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.