తెలుగుదేశం పార్టీ పుట్టింది ఆ పత్రిక నుంచే.. ఆ పేరును సూచించింది ఎవరో తెలుసా..?

తెలుగు సినీ రంగంలో అగ్ర నటుడు, రాజకీయాల్లోకి ఎంట్రి ఇచ్చి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలన సంస్కరణలకు నాంది పలికిని ఆదర్శనీయుడు నందమూరి తారక రామారావు గురించి భారతదేశ ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.


తెలుగు రాష్ట్రంలో రాజకీయ సంక్షోభాన్ని చూసిన ఆయన పేద ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా రాజకీయ పార్టీని స్థాపించి కేవలం ఆరు నెలల్లోనే అధికారం చేపట్టడం నేటికీ భారతదేశంలో సంచలన రికార్డుగానే మిగిలింది.

ఇదంతా ఎలా ఉన్నా.. ఎన్టీఆర్ పెట్టే రాజకీయ పార్టీకి ఎలా బీజం పడింది..? ‘తెలుగుదేశం’ పేరును సూచించింది ఎవరు..? ఆ పేరును ఎక్కడి నుంచి తీసుకున్నారో తెలుసా..? ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. 1981లో ‘సర్దార్ పాపారాయుడు’ సినిమా షూటింగ్ ఊటీ, కులు మనాలి ప్రాంతాల్లో జరుగుతున్నది. సమాజంలో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలు, దౌర్జన్యాలను, సామాజిక సమస్యలను ఎదిరించి నిలబడటం ‘సర్దార్ పాపారాయుడు’ చిత్ర కథ. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చిన్నాభిన్నంగా మారాయి. ఆరు నెలలకు ఓ ముఖ్యమంత్రి మారడం, రాష్ట్రంలోని రాజకీయ అనిశ్చితి నెలకొనడం, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ధీటైన ప్రతిపక్షం లేకపోవడం ఎన్టీఆర్‌ను ఆలోచనలో పడేసింది. అదేసమయంలో ఎన్టీఆర్ వయసు 60 వసంతాలల్లో ప్రవేశిస్తుంది. ఈ సందర్భంలో అక్కడికి వచ్చిన జర్నలిస్టులు ఎన్టీఆర్‌తో ముచ్చటించారు. ఈ క్రమంలో ఓ జర్నలిస్ట్ చొరవ తీసుకుని.. ”సార్, మరో ఆరు నెలల్లో మీకు అరవై ఏళ్లు వస్తాయి. దాన్ని దృష్టిలో ఉంచుకుని మీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారా?” అని ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు ఎన్టీఆర్ అప్పటికప్పుడు సూటిగా నిర్ణయం చెప్పనప్పటికీ.. ”30 ఏళ్లుగా తెలుగు ప్రజలు నన్ను ఆదరిస్తున్నారు. సినిమాల్లో నన్ను చూసి దేవుడిగా వారి హృదయాల్లో నిలుపుకున్నారు. ఎక్కడో చిన్న పల్లెటూరు నిమ్మకూరులో పుట్టిన నాపై ఇంత ప్రేమను కురిపిస్తున్నారు. నేను ఈ తెలుగు ప్రజలకు రుణపడి ఉంటా. ఇకపై ఈ పుట్టిన రోజు నుంచి నెలలో 15 రోజులు ప్రజల సేవలో గడపాలని కోరుకుంటున్నాను” అంటూ చెప్పారు. అయితే ఎన్టీఆర్ ఏదైన మాట అన్నారంటే దానికి కట్టుబడి ఉంటారని అందరికి తెలిసిందే. ఇదే విషయాన్ని అప్పటి పత్రికలు హైలెట్ చేసి ప్రజెంట్ చేశాయి. నెల్లూరుకు చెందిన ఓ రాజకీయ పత్రిక ఏకంగా ఎన్టీఆర్ రాజకీయ పార్టీ పెట్టబోతున్నారని వార్త ప్రచురించి రాష్ట్రంలో తీవ్ర చర్చకు దారి తీసేలా చేసింది.

ఈ సంఘటనకు ముందే ఎన్టీఆర్ మిత్రుడు, ప్రముఖ జ్యోతిష్యుడు బీవీ మోహన్ రెడ్డి ఈ విషయంపై ప్రస్తావించారట. ”నా జ్యోతిష్యం ప్రకారం మీరు రాజకీయ పార్టీ పెడితే మీరే ముఖ్యమంత్రి అయ్యి రాష్ట్రాన్ని ఏలుతారని” చెప్పారట. బీవీ మోహన్ రెడ్డి జ్యోతిష్యాన్ని అమితంగా ఇష్టపడి, నమ్మే ఎన్టీఆర్ సర్దార్ పాపారాయుడి చిత్రకథ ఇతివృత్తం ప్రభావం, రాష్ట్రంలో అప్పట్లో నెలకొన్న రాజకీయ అనిశ్చితిని దృష్టిలో పెట్టుకొని రాజకీయ పార్టీ ఆలోచన చేసినట్టు ఆయన సన్నిహితులు పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు.

అయితే రాజకీయ పార్టీ పెట్టాలనుకున్న ఎన్టీఆర్‌కు పార్టీ పేరు సూచించింది ఈనాడు గ్రూప్ ఆఫ్ సంస్థల అధినేత రామోజీ రావు అని అందరికి తెలియకపోవచ్చు. అప్పటికే రాష్ట్రంలో ‘తెలుగుదేశం’ పేరుతో తెలుగు వార పత్రిక నడుస్తుంది. ఆ పత్రిక ఎడిటర్ సూర్యదేవర రాజ్యలక్ష్మమ్మ. కృష్ణా జిల్లా వీరులపాడు గ్రామంలో జన్మించిన ఆమెకు గుంటూరు జిల్లా చేబ్రోలుకు చెందిన వ్యక్తితో వివాహం అయింది. సూర్యదేవర రాజ్యలక్ష్మమ్మ పుట్టిన, మెట్టిన రెండు గ్రామాల ప్రజలు విద్య, రాజకీయ రంగంలో ఎంతో చైతన్యవంతులు కావడం విశేషం. ఆ నేపథ్యంలోనే ఒక మహిళ పత్రికా ఎడిటర్‌గా ఎదిగింది అంటారు. 1949లోనే ఒక మహిళ పత్రికా సంపాదకురాలు స్థాయికి ఎదిగడం అసాధారణ విషయమనే చెప్పవచ్చు. సూర్యదేవర రాజ్యలక్ష్మమ్మ సంపాదకురాలిగా ఉన్న పత్రిక పేరే ‘తెలుగుదేశం’. రామోజీరావు సూర్యదేవర రాజ్యలక్ష్మమ్మతో సంప్రదింపులు జరిపి ఆమె అనుమతితో ‘తెలుగుదేశం’ పేరును పార్టీకి ఖరారు చేశారు. ఆ తర్వాత అదే పేరు తెలుగు జాతి గౌరవం, ఔనత్యాన్ని నిలిపేదిగా నిలిచింది. ప్రపంచం నలుమూలలా తెలుగోడి సత్తాని వెలుగెత్తి చాటింది.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.