విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ (Google data center) ఏర్పాటుపై అధికారిక ప్రకటన వెలువడింది. విశాఖలో 6 బిలియన్ డాలర్లతో డేటా సెంటర్ ఏర్పాటును ధ్రువీకరిస్తూ ఇన్వెస్ట్ ఇండియా ఎక్స్‌లో పోస్టు చేసింది.
దీనిపై కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ కూడా అధికారికంగా నిర్ధరించింది. ఒక గిగావాట్ సామర్థ్యంతో ఆసియాలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ విశాఖలో నిర్మాణం కానుంది. గ్రీన్ ఎనర్జీ వినియోగంతో గేమ్ ఛేంజర్‌గా నిలవనుంది. మూడు సముద్రపు కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ల ద్వారా విశాఖలో ఈ కేంద్రం ఏర్పాటుకానుంది. ముంబయికి రెండు రెట్ల సామర్థ్యంతో రూపుదిద్దుకోనుంది.
హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ తరహాలో విశాఖలోని మధురవాడ దగ్గర 500 ఎకరాల్లో డేటా సిటీని అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. హౌసింగ్ డేటా సెంటర్లు, కృత్రిమ మేధ (ఏఐ) హబ్‌ల ఏర్పాటుకు అందులో చోటు కల్పించనుంది. డీప్ టెక్నాలజీ, బిగ్ డేటా, ఏఐ రంగాల్లో ప్రపంచ వ్యాప్తంగా విస్తృత అవకాశాలున్నాయని భావిస్తున్న ప్రభుత్వం.. వాటిని అందిపుచ్చుకోవడానికి ఈ డేటా సిటీపై ప్రత్యేక దృష్టి సారించింది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖలో ఐటీ రంగం అభివృద్ధిని ప్రాధాన్యంగా తీసుకుంది. ఐటీ మంత్రి లోకేశ్ ఆలోచనలకు అనుగుణంగా ‘డేటా సిటీ’ రూపుదిద్దుకోనుంది. విశాఖకు వచ్చే ఐటీ ఆధారిత కంపెనీలకు డేటా సిటీని కేంద్రంగా చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన.
































