తుది అంకానికి మెగా డీఎస్సీ

మెగా డీఎస్సీ ప్రక్రియ తుది అంకానికి చేరుకుంది.


ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించి మెగా డీఎస్సీ మెరిట్‌ లిస్ట్‌ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన గురువారం ప్రారంభమైంది. డెంకాడ మండలం మోదవలస ఓయోస్టార్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో ఆర్జేడీ విజయభాస్కర్‌, పార్వతీపురం, విజయనగరం డీఈవోలు బత్తుల రాజకుమార్‌, యు.మాణిక్యాలనాయుడు పర్యవేక్షణలో ఎనిమిది బృందాలు అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలిస్తున్నాయి. తొలి రోజు 398 మంది అభ్యర్థులను ధ్రువపత్రాల పరిశీలనకు అధికారులు పిలిచారు. గురువారం సాయంత్రం 6 గంటల సమయానికి 244 మంది అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన పూర్తయినట్టు తెలిసింది. రాత్రి ఎంత సమయమైనా మిగతా అభ్యర్థుల సర్టిఫికెట్లను కూడా పరిశీలించనున్నారు.

583 టీచర్‌ పోస్టులు..

ఉమ్మడి విజయనగరం జిల్లాలో 583 టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఏడాది జూన్‌ 6 నుంచి జూలై 2 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించారు. గత నెల 11న అభ్యర్థులకు వ్యక్తిగత స్కోర్‌ కార్డులతో ఫలితాలు విడుదల చేశారు. ఈ నెల 23న ఎజ్జీటీ మెరిట్‌ జాబితాను 7,725 మందితో ప్రకటించారు. పాఠశాల సహాయకుల కేటగిరీలో ఆంగ్లానికి 665 మందితో, గణితంలో 1,497 మంది, ఫిజికల్‌ సైన్స్‌ 1,398 మంది, సోషల్‌ 2,618 మంది, తెలుగు 885 మంది, బయాలజీ 1359 మందితో మెరిట్‌ జాబితాను ప్రకటించారు. ఉమ్మడి జిల్లాలో మున్సిపల్‌, జడ్పీ, ఎంపీపీ, ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్జీటీలు 210, పాఠశాల సహాయకుల క్యాడర్‌లో తెలుగు 14, హిందీ 14, ఆంగ్లం 23, గణితం 8, భౌతికశాస్త్రం 32, జీవశాస్త్రం 20, సాంఘిక శాస్త్రం 62, పీఈటీ 63 మొత్తం 446 టీచర్‌ ఖాళీలు, ట్రైబల్‌ వెల్ఫేర్‌, ఆశ్రమ పాఠశాలల్లో ఎస్జీటీలు 60, పాఠశాల సహాయకుల క్యాడర్‌లో ఆంగ్లం 7, గణితం 25, భౌతిక శాస్త్రం 24, జీవశాస్త్రం 16, సాంఘిక శాస్త్రం 5 మొత్తం 137 టీచర్‌ పోస్టులు ఖాళీలను చూపించారు. వీటి భర్తీకి ఉమ్మడి జిల్లాలో ప్రకటించిన మెరిట్‌ లిస్ట్‌ నుంచి రిజర్వేషన్‌, నియమ నింబధనలకు అనుగుణంగా ఈ నెల 26న అభ్యర్థులకు కాల్‌ లెటర్లు పంపించారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.