ఇండియా బుల్లెట్‌ రైలు: రెడీ అవుతున్న స్టేషన్లు చూస్తారా?

దేశంలో బుల్లెట్‌ రైలు పరుగులకు ఏర్పాట్లు చకాచకా సాగుతున్నాయి. ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రారంభానికి ఇంక ఒక్క అడుగు దూరంలోనే ఉందని, స్టేషన్లు దాదాపు పూర్తయ్యే దశలో ఉన్నాయని పేర్కొంటూ భారతీయ రైల్వే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో వాటి ఫొటోలను షేర్‌ చేసింది.


ముంబై-అహ్మదాబాద్ కారిడార్‌కు సంబంధించి గుజరాత్‌లోని బుల్లెట్ ట్రైన్ స్టేషన్లు దాదాపు పూర్తయ్యాయని ‘ఎక్స్‌’లో ఇండియన్‌ రైల్వేస్‌ పోస్ట్ చేసింది. ఆధునిక డిజైన్, సాంస్కృతిక గుర్తింపు, అంతరాయం లేని కనెక్టివిటీ, పర్యావరణ అనుకూల లక్షణాలతో, స్టేషన్లు ప్రయాణికుల సౌకర్యాన్ని పునర్నిర్వచిస్తాయని, ప్రయాణంలో కొత్త బెంచ్‌మార్క్‌లను సెట్ చేస్తాయని పేర్కొంది.

ఎన్ని స్టేషన్లు, ఎక్కడెక్కడ?
ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కారిడార్‌లో మొత్తం 12 స్టేషన్లు ఉన్నాయి. అవి ముంబై (బాంద్రా-కుర్లా కాంప్లెక్స్), థానే, విరార్, బోయిసర్, వాపి, బిలిమోరా, సూరత్, భరూచ్, వడోదర, ఆనంద్, అహ్మదాబాద్, సబర్మతి.

వీటిలో నాలుగు స్టేషన్లు మహారాష్ట్ర (ముంబై, థానే, విరార్, బోయిసర్), ఎనిమిది గుజరాత్ (సబర్మతి, అహ్మదాబాద్, ఆనంద్, వడోదర, భరూచ్, సూరత్, బిలిమోరా, వాపి)లో ఉన్నాయి.

ఈ ప్రాజెక్టు మొత్తం పొడవు 508 కిలోమీటర్లు. ఇందులో గుజరాత్ లో 348 కిలోమీటర్లు, మహారాష్ట్రలో 156 కిలోమీటర్లు, కేంద్రపాలిత ప్రాంతమైన దాద్రా నగర్ హవేలీ గుండా 4 కిలోమీటర్లు వెళుతుంది.

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు వివరాలు
బుల్లెట్ రైలు గరిష్ట ఆపరేటింగ్ వేగం గంటకు 320 కిలోమీటర్లు, మొత్తం ప్రయాణానికి 2 గంటల 7 నిమిషాలు పడుతుందని భావిస్తున్నారు. ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో జపనీస్ షింకన్ సేన్ ట్రాక్ సిస్టమ్ ఆధారంగా జె-స్లాబ్ ట్రాక్ సిస్టమ్ ఉంటుంది. ప్రాంతాల వారీగా చూస్తే, కారిడార్లో ఏడు పర్వత సొరంగాలు (మహారాష్ట్రలో ఆరు, గుజరాత్లో ఒకటి), 24 నదీ వంతెనలు (20 గుజరాత్లో, నాలుగు మహారాష్ట్రలో ఉన్నాయి) ఉన్నాయి.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.