వియత్నాంకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ విన్‌ఫాస్ట్ (VinFast) ఇప్పుడు భారతదేశంలోకి అడుగుపెట్టనుంది. తమిళనాడులోని తూత్తుకుడిలో ఈ సంస్థ తన తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేసింది.
అక్కడ ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి కూడా ఇటీవలే ప్రారంభమైంది. దీంతో ఇప్పుడు భారత మార్కెట్‌లో ఈవీ కార్లను విడుదల చేయడానికి విన్‌ఫాస్ట్ సిద్ధమవుతోంది. లాంచ్‌కు ముందే ఈ కార్లకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఈ కారు ధరలు, ఫీచర్లు, లాంచ్ వివరాలను ఈ వార్తలో తెలుసుకుందాం.
విన్‌ఫాస్ట్ కంపెనీ భారత మార్కెట్‌లో తొలి దశలో రెండు ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కార్లను విడుదల చేయనుంది. అవి విన్‌ఫాస్ట్ విఎఫ్ 6 (VinFast VF 6), విన్‌ఫాస్ట్ విఎఫ్ 7 (VinFast VF 7). ఈ రెండు కార్లను గత జనవరిలో జరిగిన 2025 భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ప్రదర్శించారు. ఆ తర్వాత జులైలో ఈ రెండు కార్లకు బుకింగ్‌లు ప్రారంభించారు.
వీటి లాంచ్ తేదీని ఇప్పుడు అధికారికంగా ప్రకటించారు. ఎన్‌డీటీవీ ఆటో నివేదిక ప్రకారం. ఈ రెండు ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు సెప్టెంబర్ 6న భారత మార్కెట్‌లో విడుదల కానున్నాయి. అదే రోజున వాటి అధికారిక ధరలను కూడా ప్రకటిస్తారు.
విన్‌ఫాస్ట్ విఎఫ్ 7 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో 70.8 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఈ కారు ఫ్రంట్-వీల్ డ్రైవ్, ఆల్-వీల్ డ్రైవ్ అనే రెండు ఆప్షన్లలో లభిస్తుంది. ఫ్రంట్-వీల్ డ్రైవ్ మోడల్ 450 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ ఇస్తుందని అంచనా. అలాగే, ఆల్-వీల్ డ్రైవ్ మోడల్ 431 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ ఇస్తుంది.
విన్‌ఫాస్ట్ విఎఫ్ 6 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ విషయానికి వస్తే, ఇందులో 59.6 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది 480 కిలోమీటర్ల వరకు డ్రైవింగ్ రేంజ్ ఇవ్వగలదు. ఈ రెండు కార్లపైన భారత కస్టమర్లలో భారీ అంచనాలు ఉన్నాయి. సరైన ధర నిర్ణయంతో వీటికి మంచి స్పందన లభించే అవకాశం ఉంది.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. విన్‌ఫాస్ట్ విఎఫ్ 7 ఎస్‌యూవీ ధర సుమారుగా రూ. 50 లక్షల వరకు ఉండవచ్చు. ఇక విన్‌ఫాస్ట్ విఎఫ్ 6 ధర రూ. 25 లక్షల వరకు ఉండవచ్చని అంచనా. ఈ ధరలు ఎక్స్-షోరూమ్ ధరలు మాత్రమే. అధికారిక ధర సెప్టెంబర్ 6న లాంచ్ రోజున తెలుస్తుంది.
విన్‌ఫాస్ట్ మొదట అధిక ధర కలిగిన కార్లను విడుదల చేసినప్పటికీ, భవిష్యత్తులో తక్కువ ధర కలిగిన కార్లను కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. రానున్న కాలంలో రూ. 10 లక్షల లోపు ధరలో కూడా విన్‌ఫాస్ట్ కార్లు భారత మార్కెట్‌లోకి రావచ్చని ఆశిస్తున్నారు. దీంతో భారతదేశంలో ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీలలో ఒకటిగా విన్‌ఫాస్ట్ మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
































