ఇంట్లో ఉండే కొన్ని ప్రమాదకర వస్తువులను వీలైనంత త్వరగా వదిలించుకోవాలని ఎయిమ్స్, హార్వర్డ్, స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలలో శిక్షణ పొందిన గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, హెపటాలజిస్ట్ డాక్టర్ సౌరభ్ సేథీ సూచిస్తున్నారు.
మీ ఇంట్లో శుభ్రం చేయడానికి లేదా అనవసరమైన వస్తువులను పారేయడానికి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మనం రోజువారీగా ఉపయోగించే ఎన్నో వస్తువులు బయటకు అమాయకంగా కనిపించినా, మన ఆరోగ్యానికి తెలియకుండానే హాని కలిగిస్తాయి. వంటింట్లోని గీతలు పడిన నాన్‌స్టిక్ ప్యాన్‌ల నుండి బట్టలు ఉతికే డిటర్జెంట్లలో ఉండే సువాసనల వరకు.. ఇవన్నీ మన గట్ ఆరోగ్యాన్ని, హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తాయి. ఈ ప్రమాదకర వస్తువులను వీలైనంత త్వరగా వదిలించుకోవాలని ఎయిమ్స్, హార్వర్డ్, స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలలో శిక్షణ పొందిన గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, హెపటాలజిస్ట్ డాక్టర్ సౌరభ్ సేథీ సూచిస్తున్నారు.
“మీ శరీరంలోని హానికర పదార్థాల లోడ్‌ను తగ్గించుకోవడం అనేది మీ గట్, మెదడు, హార్మోన్లకు మద్దతు ఇవ్వడానికి సులభమైన మార్గాలలో ఒకటి” అని ఆయన ఆగస్టు 29న ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో వివరించారు. వంటింట్లో మొదలుపెట్టి లాండ్రీ గది వరకు మన ఆరోగ్యాన్ని దెబ్బతీసే కొన్ని వస్తువులను ఆయన వివరించారు.
1. గీతలు పడిన నాన్‌స్టిక్ పాత్రలు
దెబ్బతిన్న టెఫ్లాన్ లేదా పీటీఎఫ్ఈ ప్యాన్‌లు వాడటం చాలా ప్రమాదకరం. అధిక వేడికి గురైనప్పుడు, టెఫ్లాన్ నుంచి సూక్ష్మ ప్లాస్టిక్ రేణువులు విడుదల అవుతాయి. ఇవి మనం తినే ఆహారంలో కలిసిపోవచ్చు. అలాగే విషపూరితమైన పొగలు వెలువడి ‘టెఫ్లాన్ ఫ్లూ’ అనే అనారోగ్యానికి దారితీస్తుంది. “అది దెబ్బతింటే అంతే సంగతులు” అని డాక్టర్ సేథీ హెచ్చరించారు. బదులుగా, సిరామిక్, కాస్ట్ ఐరన్ లేదా స్టెయిన్‌లెస్ స్టీల్ పాత్రలు వాడటం చాలా సురక్షితం.
2. కృత్రిమ స్వీటెనర్లు
ఆహారంలో ఉపయోగించే కృత్రిమ స్వీటెనర్లు, ముఖ్యంగా అస్పర్టేమ్, సుక్రలోజ్ వంటివి మన గట్‌లోని మంచి బ్యాక్టీరియాకు హాని చేస్తాయి. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు, ఆకలి సంకేతాలను దెబ్బతీస్తాయి. కృత్రిమ స్వీటెనర్లు తీసుకోవడం వల్ల గ్లూకోజ్ ఇంటాలరెన్స్, మైక్రోబయోమ్ మార్పులు వస్తాయని డాక్టర్ సేథీ తెలిపారు. వీటికి బదులుగా స్వచ్ఛమైన మాంక్ ఫ్రూట్, స్టీవియా లేదా తాజా పండ్లు వాడమని ఆయన సిఫార్సు చేస్తున్నారు.
3. ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు
ప్లాస్టిక్‌లలో ఉండే బీపీఏ (బిస్ఫెనాల్ ఏ) అనే రసాయనం ఆహారం, పానీయాలలోకి చేరి శరీరంలో విష పదార్థాల స్థాయిని పెంచుతుంది. బీపీఏ లేని ప్లాస్టిక్‌లు కూడా వేడికి గురైనప్పుడు రసాయనాలను విడుదల చేసి హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతాయి. ప్లాస్టిక్‌కు బదులుగా స్టెయిన్‌లెస్ స్టీల్ లేదా గాజు పాత్రలు వాడటం మంచిది.
4. అత్యధికంగా ప్రాసెస్ చేసిన ప్యాకేజీడ్ ఆహారాలు
ప్రాసెస్ చేసిన ఆహారాలలో సీడ్ ఆయిల్స్, ప్రిజర్వేటివ్‌లు, గమ్స్, ఎమల్సిఫయర్లు ఉంటాయి. ఇవి గట్ ఆరోగ్యాన్ని, జీవక్రియలను దెబ్బతీస్తాయని నిరూపితమైంది. వీటికి బదులుగా సహజమైన, ప్యాక్ చేయని ఆహార పదార్థాలను తీసుకోవాలి.
5. సువాసనగల కొవ్వొత్తులు/ఎయిర్ ఫ్రెషనర్లు
సువాసనగల కొవ్వొత్తులు, ఎయిర్ ఫ్రెషనర్లలో ఫాథలేట్స్, వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ (VOCs) ఉంటాయి. ఇవి హార్మోన్ల అసమతుల్యతకు, వాపుకు కారణమవుతాయి. వీటికి బదులుగా బీస్వాక్స్ కొవ్వొత్తులు, ఎసెన్షియల్ ఆయిల్ డిఫ్యూజర్లు లేదా కిటికీలు తెరిచి ఉంచడం వంటివి చేయడం సురక్షితం.
6. ప్రిజర్వేటివ్స్ ఉన్న మాంసాహారం
ప్రాసెస్ చేసిన మాంసంలో సోడియం నైట్రైట్, నైట్రేట్ వంటి ప్రిజర్వేటివ్‌లు ఉంటాయి. ఇవి గట్ వాపు, మైక్రోబయోమ్ అసమతుల్యత, ఇంకా కొలొరెక్టల్ క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా పెంచుతాయి. వీటికి బదులుగా తాజాగా వండిన మాంసాన్ని తినాలని ఆయన సిఫార్సు చేశారు.
7. ట్రైక్లోసాన్ ఉన్న యాంటీబ్యాక్టీరియల్ సబ్బులు
ట్రైక్లోసాన్ అనేది ఒక యాంటీబ్యాక్టీరియల్, యాంటీఫంగల్ రసాయనం. ఇది హానికరమైన బ్యాక్టీరియాను మాత్రమే కాదు, మంచి బ్యాక్టీరియాను కూడా చంపేస్తుంది. ఇది చర్మం యొక్క సహజ రక్షణ పొరను దెబ్బతీస్తుందని, గట్ ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుందని డాక్టర్ సేథీ చెప్పారు. వీటికి బదులుగా మామూలు సబ్బు, నీళ్లు వాడాలని ఆయన సూచించారు.
8. సువాసనగల లాండ్రీ డిటర్జెంట్లు, డ్రైయర్ షీట్లు
వీటిలో ఉండే ఫాథలేట్స్, సింథటిక్ రసాయనాలు దుస్తులకు అంటుకుని, చర్మం ద్వారా శరీరంలోకి చేరుతాయి. కాలక్రమేణా ఇవి హార్మోన్ల అసమతుల్యతకు, సున్నితమైన చర్మానికి చికాకును కలిగిస్తాయని డాక్టర్ సేథీ పేర్కొన్నారు. వీటికి బదులుగా సువాసన లేని డిటర్జెంట్లు లేదా ఎసెన్షియల్ ఆయిల్స్‌తో కూడిన ఉన్ని బాల్స్‌ను ఉపయోగించాలని ఆయన సలహా ఇచ్చారు.
(గమనిక: దీన్ని ఎటువంటి వైద్య సలహాగా పరిగణించవద్దు. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. వైద్యపరమైన సలహా కోసం నిపుణులను సంప్రదించాలి.)
































