ఏపీ జర్నలిస్టులకు ఊరట.. అక్రిడిటేషన్ కార్డుల గడువు పొడిగింపు

ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం ఊరట కల్పించింది. ప్రస్తుతం వారి వద్ద ఉన్న అక్రిడిటేషన్ కార్డుల గడువు ముగుస్తున్న తరుణంలో, వాటి కాలపరిమితిని మరో మూడు నెలల పాటు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.


ఈ మేరకు రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్ల శుక్రవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆగస్టు 31తో గడువు ముగియనున్న అక్రిడిటేషన్ కార్డులు కలిగిన పాత్రికేయులకు మాత్రమే ఈ పొడిగింపు వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

తాజా ఉత్తర్వుల ప్రకారం, సెప్టెంబర్ 1 నుంచి నవంబర్ 30 వరకు లేదా రాష్ట్రంలో కొత్త అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియ పూర్తయ్యే వరకు పాత కార్డులు చెల్లుబాటు అవుతాయని హిమాన్షు శుక్ల ఆ ప్రకటనలో వివరించారు. ఈ రెండింటిలో ఏది ముందుగా జరిగితే అప్పటివరకు ఈ పొడిగింపు అమలులో ఉంటుందని ఆయన తెలిపారు. గడువు ముగుస్తుండటంతో ఆందోళన చెందుతున్న పాత్రికేయులకు ఈ నిర్ణయంతో తాత్కాలికంగా ఉపశమనం లభించినట్లయింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.