వినాయకచవితితో మొదలై దసరా నవరాత్రులు, దీపావళి, క్రిస్మస్ ఉత్సవాల వరకు దేశవ్యాప్తంగా గృహ విక్రయాల మార్కెట్‌కు పండగే. సంవత్సరం మొత్తం విక్రయాల్లో దాదాపు మూడో వంతు ఈ పండగల సమయాల్లో జరుగుతుంటాయి. ఆయా రోజులను సొంతింటిపై నిర్ణయం తీసుకునేందుకు, పెట్టుబడులు పెట్టేందుకు శుభసూచకంగా భావిస్తుంటారు. ఈ ఏడాదిలోనూ ఇదే పరంపర కొనసాగుతుందనే ఆశాభావాన్ని మార్కెట్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.
ప్రాజెక్టుల ప్రారంభాలు.. ఆఫర్లు..
ఐదు సంవత్సరాలుగా చివరి మూడు నెలలు అక్టోబరు నుంచి డిసెంబరు వరకు గృహ విక్రయాలు అత్యంత సానుకూలంగా సాగాయి. డెవలపర్లు సాధారణంగా కొత్త ప్రాజెక్టుల ప్రారంభాలు, పండగ ఆఫర్లతో కొనుగోలుదారుల దృష్టిని ఆకర్షిస్తుంటారు. కొనుగోలుదారులు సైతం పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి ఇళ్లను కొనుగోలు చేసేందుకు ముందుకొస్తుంటారు. ఫలితంగానే ఏటా చివరి మాసాలు ఆశాజనకంగా ఉండటమే కాదు మార్కెట్ పనితీరును నిర్ణయించే కీలక త్రైమాసికంగా ఉంటుందని ఆర్.ఇ.ఏ.ఇండియా సీఈవో ప్రవీణ్‌శర్మ తెలిపారు. 2025లో కూడా ఇదే తీరు కొనసాగే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.
- 2020 నుంచి 2024 వరకు ఐదేళ్లలో వార్షిక గృహ విక్రయాల పరిమాణంలో నాలుగో త్రైమాసికం వాటా 25-35 శాతంగా నమోదైంది. ప్రతి ఏడాది బలమైన త్రైమాసికంగా నిలిచింది.
- కొవిడ్ మహమ్మారి వంటి 2020 కష్టకాలంలోనూ మూడోదానితో పోలిస్తే నాలుగో త్రైమాసికంలో 32 శాతం వృద్ధి నమోదైంది. ఆ తర్వాత సంవత్సరాల్లో ఒకసారి గరిష్ఠంగా 35 శాతం వరకు వెళ్లింది.. ఇది పండగ సమయంలో డిమాండ్, స్థిరత్వాన్ని సూచిస్తుంది.
-
30 శాతంపై అంచనాలు..
గత అనుభవాలతో ఈ ఏడాది నాలుగో త్రైమాసికంలో వార్షిక విక్రయాల్లో కనీసం 30 శాతం వాటాని అందుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కొత్త ప్రాజెక్టుల ప్రకటనలు, ఆకర్షణీయమైన పథకాలు ముందుగానే ప్రవేశపెట్టడం ఇందుకు కలిసి వచ్చే అవకాశం ఉంది. తద్వారా అనుకున్న విక్రయాల లక్ష్యాన్ని చేరుకోవచ్చనే విశ్వాసం వ్యక్తమవుతోంది.
-
ప్రతికూలతను దాటుకుని..
భారతదేశ గృహనిర్మాణ మార్కెట్ 2025 ప్రథమార్థంలో కొంత మందగమనాన్ని చూపిందని నివేదికలు చెబుతున్నాయి. గత రెండేళ్ల బలమైన వృద్ధి తర్వాత ఈ రంగం ప్రస్తుతం సవరణ దశలో ఉందని చెబుతున్నారు. అయితే ప్రతి సంవత్సరం చివరి మూడు నెలలు పండగల సీజన్ డిమాండ్‌ను మళ్లీ పెంచుతుందనే ఆశ మార్కెట్లో ఉంది.
































