విశాఖలో పర్యాటక రంగ అభివృద్ధికి ఏపీ పర్యాటక శాఖ ప్రవేశపెట్టిన హాప్ ఆన్ హాప్ ఆఫ్ డబుల్ డెక్కర్ బస్సులు రోడ్డెక్కాయి. శుక్రవారం బీచ్ రోడ్ లో ఈ బస్సులను సీఎం చంద్రబాబు జెండా ఊపి ప్రారంభించారు. ఆర్కే బీచ్ నుంచి తొట్లకొండ వరకు ఈ బస్సులు బీచ్ రోడ్ లో ప్రయాణించనున్నాయి.
విశాఖపట్నంలో హాప్ ఆన్ హాప్ ఆఫ్ బస్సులు ప్రారంభయ్యాయి. శుక్రువారం విశాఖ బీచ్ రోడ్డులో డబుల్ డెక్కర్ బస్సులను జెండా ఊపి సీఎం ప్రారంభించారు. అనంతరం ప్రజాప్రతినిధులతో కలిసి బస్సులో ప్రయాణించారు.
ఆర్కే బీచ్ నుంచి తొట్లకొండ వరకు 16 కిలోమీటర్ల మేర పర్యాటక ప్రాంతాల్లో ఈ ప్రత్యేక బస్సులు తిరుగుతాయి. ప్రారంభోత్సవం సందర్భంగా ఈ ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సుల్లో స్వయంగా ప్రజా ప్రతినిధులతో కలిసి సీఎం చంద్రబాబు కొంత దూరం ప్రయాణించారు.
ప్రత్యేకంగా పర్యాటకుల కోసం అందుబాటులోకి వచ్చిన ఈ బస్సులు 24 గంటల పాటు ఒకే టికెట్‌తో ప్రయాణించే సౌకర్యం కల్పించనున్నాయి. టికెట్ ఛార్జీ రూ.500గా నిర్ణయించగా… అందులో సగం మొత్తాన్ని ప్రభుత్వమే భరించనుంది.
కేవలం రూ.250కే 24 గంటల పాటు ‘హాప్ ఆన్ – హాప్ ఆఫ్’ బస్సులో పర్యాటకులు ప్రయాణం చేయవచ్చని సీఎం చంద్రబాబు ప్రకటించారు. పౌరులు, పర్యాటకులు పర్యావరణ హితంగా ప్రవర్తించాలని… తీర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని పిలుపునిచ్చారు.
విశాఖ బీచ్‌లను ప్రపంచ స్థాయి పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు పౌరులంతా సహకరించాలని సీఎం చంద్రబాబు కోరారు. ప్రస్తుతం విశాఖ ఆర్థిక రాజధానిగా, ఆసియా టెక్నాలజీ హబ్‌గా ఎదగబోతోందన్నారు.
విశాఖలో డేటా సెంటర్, సీ కేబుల్ ఏర్పాటు కాబోతున్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ కేబుల్ ద్వారా విశాఖ ప్రపంచంతో అనుసంధానం అవుతుందన్నారు. దీని ద్వారా విశాఖ భారత్‌కే టెక్నాలజీ హబ్‌గా ఎదుగుతుందని చెప్పుకొచ్చారు.
































