దిగ్జజ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్‌మీ.. విప్లవం సృష్టించేందుకు రెడీ అవుతోంది! ఇందులో భాగంగా 15000ఎంఏహెచ్ బ్యాటరీతో కూడిన కాన్సెప్ట్ ఫోన్‌ని ఆవిష్కరించింది. పూర్తి వివరాలను ఇక్కడ చూసేయండి..
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్‌మీ ఒక విప్లవాత్మకమైన కొత్త కాన్సెప్ట్ ఫోన్‌ని ప్రదర్శించింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఏకంగా 15000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో వస్తుంది. ఇది స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ టెక్నాలజీలో ఒక పెద్ద ముందడుగు అని కంపెనీ పేర్కొంది. గతేడాది ఇదే కంపెనీ 10000ఎంఏహెచ్ బ్యాటరీతో కూడిన కాన్సెప్ట్ ఫోన్‌ను కూడా ప్రదర్శించింది!
పెద్ద బ్యాటరీ స్మార్ట్ఫోన్ల హవా..
ఈ మధ్య కాలంలో భారత మార్కెట్లో 7000ఎంఏహెచ్ బ్యాటరీ లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న ఫోన్‌లు చాలా వచ్చాయి. కొన్ని బ్రాండ్లు 8000ఎంఏహెచ్ బ్యాటరీ ఫోన్‌లను తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయని లీకులు కూడా సూచిస్తున్నాయి. లీక్‌ల ప్రకారం.. రియల్‌మీ కూడా తన 10000ఎంఏహెచ్ బ్యాటరీ ఫోన్‌ను భారత్‌లో విడుదల చేయాలని చూస్తోంది. కానీ దీనిపై అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు.
రియల్‌మీ 15000ఎంఏహెచ్ స్మార్ట్‌ఫోన్: ఇప్పటివరకు తెలిసిన వివరాలు..
ఈ 15000ఎంఏహెచ్ బ్యాటరీ ఫోన్ 100% ఫుల్ సిలికాన్ అనోడ్ టెక్నాలజీతో వస్తుంది. ఇది 1200 డబ్ల్యూహెచ్/ఎల్ ఎనర్జీ డెన్సిటీని సాధిస్తుందని రియల్‌మీ పేర్కొంది. దీనివల్ల ఒకే ఛార్జ్‌తో ఏకంగా నాలుగు రోజుల వరకు ఫోన్ వాడుకోవచ్చని కంపెనీ చెబుతోంది. అలాగే, ఒక్కసారి ఛార్జ్ చేస్తే 18 గంటల పాటు నిరంతరంగా వీడియో రికార్డింగ్ చేయవచ్చని, లేదా 53 గంటల పాటు వీడియో ప్లేబ్యాక్ చూడవచ్చని కంపెనీ హామీ ఇస్తోంది.
ఇంత భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ, ఈ కాన్సెప్ట్ ఫోన్ కేవలం 8.89 ఎంఎం మాత్రమే మందంగా ఉంటుందని రియల్‌మీ తెలిపింది! అంతేకాకుండా ఇందులో రివర్స్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది. అంటే దీనిని పవర్ బ్యాంక్‌గా కూడా ఉపయోగించుకోవచ్చు.
ఈ ఫోన్ గురించి రియల్‌మీ ఇతర వివరాలను వెల్లడించలేదు. అయితే, చైనాలోని వీబో ప్లాట్‌ఫామ్‌లో వచ్చిన లీక్‌ల ప్రకారం, ఈ ఫోన్ 6.7-ఇంచ్ డిస్‌ప్లేతో, ఆండ్రాయిడ్ 15 ఆధారిత రియల్‌మీ యూఐ 6.0 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్‌తో రానుంది. ఈ ప్రాసెసర్ ల్యావా అగ్ని 3, సీఎమ్‌ఎఫ్ ఫోన్ 1 వంటి బడ్జెట్ ఫోన్‌లలో కూడా ఉపయోగించారు. ఈ ఫోన్‌లో 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ ఉండే అవకాశం ఉంది.
రియల్‌మీ 7వ వార్షికోత్సవం: ఇతర ఆవిష్కరణలు..
రియల్‌మీ తన 7వ వార్షికోత్సవ వేడుకల్లో ఈ 15000ఎంఏహెచ్ ఫోన్‌తో పాటు ‘చిల్ ఫ్యాన్ ఫోన్’ అనే మరో ఫోన్‌ను కూడా ప్రదర్శించింది. ఇది అంతర్గత ఫ్యాన్‌తో కూడిన థర్మోఎలక్ట్రిక్ కూలింగ్ (టీఈసీ) టెక్నాలజీని ఉపయోగిస్తుంది. సాధారణంగా ఈ టెక్నాలజీ బాహ్య కూలింగ్ సిస్టమ్స్‌లో మాత్రమే ఉంటుందని రియల్‌మీ తెలిపింది. ఈ టెక్నాలజీ ద్వారా ఫోన్‌కు అధిక పనితీరు కూలింగ్‌ను అందించవచ్చని, దీనివల్ల ఫోన్ ఉష్ణోగ్రత 6 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గుతుందని కంపెనీ వివరించింది. ఈ ఉష్ణోగ్రత తగ్గింపు వల్ల జెన్షిన్ ఇంపాక్ట్, హోంకై వంటి భారీ గేమ్‌లు ఆడినప్పుడు కూడా ఫోన్ సాఫీగా, అధిక ఫ్రేమ్ రేట్స్‌తో పనిచేస్తుందని రియల్‌మీ పేర్కొంది!




































