రెనాల్ట్ కైగర్ వర్సెస్ నిస్సాన్ మాగ్నైట్.. ఈ రెండు ఫ్యామిలీ ఎస్‌యూవీల్లో ఏది బెస్ట్? దేని ఫీచర్స్ ఏంటి? ఇంజిన్ ఆప్షన్స్ ఏంటి? ధరలు ఎలా ఉన్నాయి? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
భారత మార్కెట్‌లో సబ్-4 మీటర్ ఎస్‌యూవీ సెగ్మెంట్ ప్రస్తుతం అత్యంత పోటీ నెలకొంది. ఈ విభాగంలో రెనాల్ట్ కైగర్, నిస్సాన్ మాగ్నైట్ కీలకమైన ప్లేయర్స్. ఈ రెండు కార్లు ఒకే ప్లాట్‌ఫామ్‌పై నిర్మించినప్పటికీ, వాటి మధ్య డిజైన్, ఫీచర్లు, ధర విషయంలో కొన్ని ముఖ్యమైన తేడాలు ఉన్నాయి. ఇటీవల రెనాల్ట్ తన కైగర్‌ను కొన్ని కొత్త అప్‌డేట్‌లతో ఫేస్‌లిఫ్ట్ వర్షెన్‌ని మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. మరోవైపు నిస్సాన్ మాగ్నైట్ తనదైన శైలిలో మార్కెట్‌లో దూసుకెళ్తోంది. పైగా, ఈ రెండు ఎస్‌యూవీలు కూడా బడ్జెట్ రేంజ్లో, మిడిల్‌క్లాస్- ఫ్యామిలీకి బెస్ట్ ఛాయిస్‌గా ఉన్నాయి. మరి ఈ రెండింటిలో ఏది కొనాలి?
రెనాల్ట్ కైగర్ వర్సెస్ నిస్సాన్ మాగ్నైట్- డిజైన్..
2025 రెనాల్ట్ కైగర్ మరింత పదునైన గ్రిల్, కొత్త 2డీ లోగో, ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, క్రోమ్ ట్రిమ్, అప్‌డేటెడ్ బంపర్స్, కొత్త 16-ఇంచ్ అల్లాయ్ వీల్స్‌తో ఆకట్టుకుంటుంది. క్రోమ్ డోర్ హ్యాండిల్స్, బ్లాక్-అవుట్ మిర్రర్స్ దీనికి ప్రీమియం లుక్‌ను అందిస్తాయి.
మరోవైపు నిస్సాన్ మాగ్నైట్ ఎస్‌యూవీ తన అగ్రెసివ్ డిజైన్‌కు కట్టుబడి ఉంది. విశాలమైన, క్రోమ్-డామినెంట్ గ్రిల్, బూమరాంగ్ లాంటి డీఆర్‌ఎల్స్, గ్లోస్-బ్లాక్ ట్రిమ్మింగ్, డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ దీనిని మరింత స్టైలిష్‌గా మారుస్తాయి. ఈ రెండు కార్లు ఆధునికమైనవే అయినా, వాటి డిజైన్ శైలి మాత్రం భిన్నంగా ఉంటుంది.
రెనాల్ట్ కైగర్ వర్సెస్ నిస్సాన్ మాగ్నైట్- ఫీచర్లు..
రెండు ఫ్యామిలీ ఎస్‌యూవీలు వాటి ధరలకు తగ్గట్టుగా మంచి ఫీచర్లు ఉన్నాయి. కొత్త కైగర్‌లో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, తెలుపు-నలుపు డ్యూయల్-టోన్ సీట్లు, 8-ఇంచ్ టచ్‌స్క్రీన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీనికి పోటీగా నిస్సాన్ మాగ్నైట్ కాస్త పెద్ద 9-ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్, ట్యాన్-అండ్-బ్లాక్ ఇంటీరియర్స్, లెదరెట్ సీట్లను అందిస్తోంది.
ఈ రెండు ఎస్‌యూవీల్లో వైర్‌లెస్ యాపిల్ కార్‌ప్లే/ఆండ్రాయిడ్ ఆటో, 7-ఇంచ్ డిజిటల్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ (వెనుక వైపు ఏసీ వెంట్స్ సహా), కనెక్టెడ్ కార్ టెక్, క్రూజ్ కంట్రోల్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఈఎస్‌సీ, హిల్ స్టార్ట్ అసిస్ట్, టీపీఎంఎస్, రియర్ కెమెరా వంటి కీలకమైన సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి.
రెనాల్ట్ కైగర్ వర్సెస్ నిస్సాన్ మాగ్నైట్- స్పెసిఫికేషన్స్..
ఈ రెండు అఫార్డిబుల్ ఫ్యామిలీ ఎస్‌యూవీల మెకానికల్స్ దాదాపు ఒకేలా ఉంటాయి. రెండింటిలోనూ రెండు రకాల ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి 70 బీహెచ్‌పీ, 96 ఎన్ఎమ్ టార్క్ ఇచ్చే 1.0-లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా ఏఎమ్‌టి ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. రెండోది 99 బీహెచ్‌పీ, 160 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేసే 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్. ఇది మాన్యువల్ లేదా సీవీటీ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది.
రెండు కార్ల రైడ్, హ్యాండ్లింగ్ ఎక్కువగా నగర ప్రయాణాలకు అనుకూలంగా ఉంటాయి. ఇక ప్రాక్టికాలిటీ విషయానికొస్తే, కైగర్‌లో 405 లీటర్ల పెద్ద బూట్ స్పేస్ ఉంది, మాగ్నైట్‌లో ఇది 336 లీటర్లుగా ఉంది. అయితే, రెండింటి వీల్‌బేస్ (2,500 ఎంఎం), గ్రౌండ్ క్లియరెన్స్ (205 మి.మీ) ఒకేలా ఉన్నాయి.
రెనాల్ట్ కైగర్ వర్సెస్ నిస్సాన్ మాగ్నైట్- ధర..
ధర విషయంలో నిస్సాన్ మాగ్నైట్ కాస్త ముందుంది. దీని ప్రారంభ ధర రూ. 6.14 లక్షలు (ఎక్స్-షోరూమ్). రెనాల్ట్ కైగర్ ప్రారంభ ధర రూ. 6.29 లక్షలు. అయితే, టాప్-ఎండ్ వేరియంట్లలో కైగర్ తన ప్రత్యర్థిని అధిగమిస్తుంది. టాప్ ఎమోషన్ ట్రిమ్ కైగర్ ధర రూ. 11.29 లక్షలు కాగా, మాగ్నైట్ టాప్ వేరియంట్ ధర రూ. 11.76 లక్షలుగా ఉంది.
































