ఆరేళ్లపాటు OS అప్‌డేట్స్‌తో శాంసంగ్‌ గెలాక్సీ A17 5G

ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ శాంసంగ్‌ తన ‘ఏ’ సిరీస్‌లో మరో కొత్త ఫోన్‌ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. శాంసంగ్‌ గెలాక్సీ ఏ17 5జీ పేరిట దీన్ని పరిచయం చేసింది. ఆరేళ్ల పాటు ఓఎస్‌ అప్‌డేట్స్‌, ఆరేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ అందిస్తామని కంపెనీ హామీ ఇస్తోంది.


గెలాక్సీ ఏ17 5జీలో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఇన్‌ఫినిటీ-యూ సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే ఇచ్చారు. 90Hz రిఫ్రెష్‌రేటు, కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ విక్టస్‌ ప్రొటెక్షన్‌తో వస్తోంది. ఇందులో Exynos 1330 ప్రాసెసర్‌ అమర్చారు. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత వన్‌ యూఐ 7 ఆధారంగా పనిచేస్తుంది. ఫోన్‌ వెనకభాగంలో 50 ఎంపీ ప్రధాన కెమెరా, 5ఎంపీ అల్ట్రావైడ్, 2 ఎంపీ మాక్రో కెమెరా ఇచ్చారు. 13 ఎంపీ సెల్ఫీ కెమెరాతో వస్తోంది. ఇది 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 25W ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. ఇది బ్లాక్‌, గ్రే కలర్స్‌లో లభిస్తుంది.

ఇక ధర విషయానికొస్తే.. ఈ ఫోన్‌ మూడు వేరియంట్లలో లభిస్తుంది. 6జీబీ+128జీబీ వేరియంట్‌ ధర రూ.18,999గా కంపెనీ నిర్ణయించింది. 8జీబీ+128జీబీ ధర రూ.20,999 కాగా.. 8జీబీ+256జీబీ ధర రూ.23,499గా పేర్కొంది. వినియోగదారులు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో కొనుగోలు చేసినట్లయితే ఎస్‌బీఐ, హెడీఎఫ్‌సీ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌లపై రూ.1000 డిస్కౌంట్‌ లభిస్తుంది. శాంసంగ్‌ అధికారిక వెబ్‌సైట్‌, అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌తో పాటు కొన్ని ఎంపిక చేసిన రిటైల్‌ స్టోర్లలో ఈ గెలాక్సీ ఏ17 దొరుకుతోంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.