నలభై ఐదేళ్లు దాటితే కంటిచూపులో మార్పులు రావడం మొదలవుతాయి. చిన్న అక్షరాలు స్పష్టంగా కనిపించవు, పట్టిపట్టి చదివితే తలనొప్పి మొదలవుతుంది. మరికొన్నిసార్లు అక్షరాలు అలికినట్టుగా ఉంటాయి.
దీన్నే ఛత్వారం అనీ, ప్రెస్బయోపియా అనీ అంటారు. ప్రపంచవ్యాప్తంగా 180 కోట్లమంది ఈ సమస్యతో బాధపడుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. వయసుతోపాటు వచ్చే ఈ సమస్యకు పరిష్కారంగా వైద్యులు ఇంతవరకూ రీడింగ్ గ్లాసెస్నే సూచిస్తున్నారు. అయితే ఇకపైన వాటిని వాడాల్సిన అవసరం లేకుండా లెన్జ్ థెరాప్యుటిక్స్ అనే సంస్థ అసెక్లైడిన్ అఫ్తాల్మలాజిక్ సొల్యుషన్ని ఉపయోగించి విజ్ పేరుతో ఐడ్రాప్స్ని తీసుకొచ్చింది.
వీటిని రోజులో ఒక్కసారి వాడితే చాలట. డ్రాప్స్ వేసుకున్న అరగంట తర్వాత నుంచి ఎటువంటి కళ్లద్దాల అవసరం లేకుండానే పదిగంటలపాటు కళ్లు స్పష్టంగా కనిపిస్తాయట. ప్రత్యేకమైన ఈ ఔషధం కంటిపాపలోని కండరాలపైన ఒత్తిడి తీసుకొచ్చి వాటి పరిమాణంలో మార్పు తీసుకొస్తుందట. దాంతో కళ్లు దగ్గర వస్తువులని స్పష్టంగా చూడగలుగుతాయట. అంటేే ఇక వెళ్లిన ప్రతిచోటుకీ కళ్లద్దాలను తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా ఐడ్రాప్స్ వేసుకుని వెళ్తే సరిపోతుందన్నమాట.
































