ఆధార్ కార్డు యూజర్లకు బిగ్ అప్డేట్. ఇక నుంచి ఆధార్ కార్డుల్లో మార్పులు, చేర్పుల కోసం సెంటర్లకు వెళ్లకుండా వెసులుబాటు కలగనుంది. ఆధార్ లో అవసరమైన మార్పుల కోసం యూఐడీఏఐ త్వరలోనే ఏఐ, ఫేస్ ఐడీ ఫీచర్లతో కొత్త ‘ఈ-ఆధార్ యాప్’ను లాంఛ్ చేసేందుకు సిద్ధమవుతోంది.
ఇది కనుక అందుబాటులోకి వస్తే మీ మొబైల్లోనే మీరు పేరు, చిరునామా, పుట్టిన తేదీ, ఫోన్ నంబర్ అప్డేట్ చేసుకునే అవకాశం కలుగుతుంది.
ప్రస్తుతం ఆధార్ లో మార్పుల కోసం యూజర్లు వివరాలను అప్డేట్ చేయాలంటే, కచ్చితంగా ఆధార్ నమోదు కేంద్రాలకు వెళ్లాల్సి వస్తోంది. సెంటర్ల వద్ద క్యూలో నిలబడాల్సి వస్తోంది. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో, ఇంటర్నెట్ అందుబాటులో లేని ప్రాంతాల్లోని ప్రజలైతే చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందుకే ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు యూఐడీఏఐ సిద్ధమవుతోంది. సరికొత్త ఈ-ఆధార్ మొబైల్ యాప్ ను అభివృద్ధి చేస్తోంది. కొత్త యాప్ అందుబాటులోకి వచ్చినప్పటికీ, వేలిముద్రలు, ఐరిస్ స్కాన్ లాంటి బయోమెట్రిక్ డేటాలో మార్పులు చేయాలంటే, కచ్చితంగా వ్యక్తిగతంగా ఆధార్ సెంటర్లకు వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుతం యూఐడీఏఐ ‘బయోమెట్రిక్ అప్డేట్’ గడువును 2025 నవంబర్ వరకు పొడిగించింది.
ఎలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు ఏఐ, ఫేస్ ఐడీ ఫీచర్లతో కొత్త ‘ఈ-ఆధార్ యాప్’ను తీసుకువస్తున్నారు. దీని ద్వారా ఆధార్ వివరాల అప్డేట్ ప్రక్రియ చాలా వేగవంతం అవుతుంది. సురక్షితంగా ఉంటుంది. ప్రస్తుతం ఆధార్ వివరాలు అప్డేట్ చేయాలంటే పాస్వర్డులు, ఓటీపీలు ఎంటర్ చేయాల్సి వస్తోంది. కానీ కొత్త యాప్ అందుబాటులోకి వస్తే ఫేస్ ఐడీతో నేరుగా లాగిన్ అవ్వవచ్చు. వివరాలు అప్డేట్ చేయవచ్చు. కనుక యూజర్ల వ్యక్తిగత వివరాల చోరీకి, మోసాలకు అవకాశం తగ్గుతుంది. కొత్త యాప్ వచ్చిన తరువాత ఆటోమేటిక్గా వెరిఫికేషన్ పూర్తి అయిపోతుంది. యూజర్ తన ఆధార్ చిరునామా వివరాలు సమర్పిస్తే, ఆ వివరాలు సరైనవో, కావో క్రాస్-వెరిఫికేషన్ చేస్తుంది. దీని ద్వారా పూర్తి భద్రతా ప్రమాణాలతో ఈ యాప్ వినియోగించుకునే విధంగా అందుబాటులోకి తీసుకొస్తోంది.
































