ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో మొబైల్ ఫోన్ జీవన విధానంలో ఓ భాగంగా మారిపోయింది. పొద్దున్న లేచింది మొదలు రాత్రిళ్లు పడుకునే వరకూ మొబైల్ ఫోన్ లేకుండా క్షణం కూడా ఉండలేని పరిస్థితి నెలకొంది.
చిన్నా పెద్దా అని తేడా లేకుండా మొబైల్ ఫోన్ కు అంతలా అతుక్కుపోతున్నారు. ఆఖరికి పడుకునేటప్పుడు కూడా దాన్ని వదిలిపెట్టకుండా తలగడ పక్కనే పెట్టుకొని నిద్రపోయేవారు చాలా మందే ఉన్నారు. అలారం పెట్టుకోవడానికి అని.. టైమ్ చూసుకోవడానికి అనీ.. ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుందని ఇలా రకరకాల కారణాల వల్ల ఫోన్ ను తల పక్కనే పెట్టుకుని నిద్రపోతుంటారు. అయితే ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
రాత్రి సమయంలో మొబైల్ ఫోన్ నుంచి బ్లూ లైట్స్ వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి మెలటోనిన్ హార్మోన్ల ఉత్పత్తిని తగ్గిస్తాయి. దీంతో మెదడు, గుండె, చర్మ సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. మెలటోనిన్ హార్మోన్ తగ్గితే నిద్రలేమితో పాటు అలసట, డిప్రెషన్, ఇన్సోమ్నియా సమస్యలు వస్తాయని చెబుతున్నారు. అంతేకాక ఫోన్ నుంచి తీవ్రమైన రేడియేషన్ వస్తుంది. దాంతో నిరాశ, చిరాకు, అలసట లాంటివి వస్తాయని తెలిపారు.
అలాగే నిద్రలో మొబైల్ పక్కనే పెట్టుకోవడం కారణంగా పదే పదే వచ్చే నోటిఫికేషన్ల వల్ల నిద్రకు ఆటంకం కలుగుతుందంటున్నారు. ఫలితంగా నిద్ర నాణ్యత తగ్గి నిద్రలేమి సమస్యకు దారితీస్తుందని.. సరైన నిద్ర లేకపోవడం అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు అంటున్నారు. నిద్ర లేమి కారణంగా ఇతరుల విషయాలు, సాధారణ విషయాలు కూడా సరిగా అర్థం కావని నిపుణులు సూచిస్తున్నారు.
అంతేకాక.. ఫోన్ నుంచి వచ్చే నీలి రంగు కాంతి వివిధ రకాల కంటి సమస్యలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ కిరణాల కారణంగా ముఖ్యంగా దృష్టి మసకబారడం, కంటి చూపు దెబ్బతినడం లాంటివి చోటుచేసుకోవచ్చంటున్నారు. కాబట్టి, రాత్రిపూట వీలైనంత వరకు స్మార్ట్ఫోన్కు దూరంగా ఉండడం మంచిది అంటున్నారు.
































