జుట్టు తెల్లబడిందని రంగు వేస్తున్నారా? లేక ట్రెండ్ అని కలర్ స్ట్రీకింగ్ చేస్తున్నారా? ఏం రకంగా డై వేసినా ప్రమాదమే అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
తరచూ వేసుకోవడమే కాదు… కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోవడమూ ఇందుకు కారణమేనని హెచ్చరిస్తున్నారు.
తలలో ఒక్క తెల్ల వెంట్రుక కనిపించినా చాలు…గుండె ఆగినంత పనవుతుంది? ఎందుకంటే వృద్ధాప్యం మీద పడుతోందనే చింతన. అయితే మారిన ఆహారపు అలవాట్లు, పోషకలేమి, కాలుష్యం….వంటి కారణాలతో ఆ ప్రక్రియ టీనేజీ వయసు నుంచే మొదలవుతోంది. ఈ వాస్తవాలు వేటినీ మనసు ఒప్పుకోదు. కేవలం ఆ తెల్ల వెంట్రుకల్ని కనిపించకుండా, కొత్తవి రాకుండా చేయడంపైనే దృష్టంతా ఉంటుంది. అందుకే, దాన్ని అలా చూసి చూసి ఓ క్షణాన చటుక్కున లాగేస్తాం. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకునేలోగానే… కుప్పలు తెప్పలుగా కనిపిస్తాయి. ఇక, అది మొదలు వాటిని ఎలా దాచిపెడదామా అన్న ఆలోచనలే. ఆ క్రమంలోనే హెయిర్‌డై వేయడానికి సిద్ధపడిపోతున్నారు. ఇంకొందరేమో ఫ్యాషన్ పేరుతో కలర్ స్ట్రీకింగ్ చేయించుకుంటున్నారు.
అప్పుడు ఏం చేసేవారంటే…
ప్రాచీన కాలం నుంచీ భారతీయులు నల్లటి కురులకోసం తాపత్రయపడేవారట. హెన్నా, ఇండిగోలతో పాటు జుట్టు తెల్లబడకుండా ఉండేందుకు ఆముదం, నువ్వుల నూనె వంటివాటిని ఉపయోగించేవారు. ఆయుర్వేద గ్రంథాల్లో కేశ రంజక(జుట్టు రంగు మార్చేవి)గా బిల్వ, భృంగరాజ్ వంటివాటి ప్రస్తావన ఉంది. అయితే, కాలక్రమంలో వచ్చిన సింథటిక్ హెయిర్ డైలు తక్షణ పరిష్కారం చూపించినా వెంటే ముప్పునీ తెచ్చిపెడుతున్నాయి.
తెల్లజుట్టూ ట్రెండే…
తెల్లజుట్టు కనిపించగానే ఏదో కోల్పోయినట్లు డీలా పడిపోకండి. ఇప్పుడు ఇదీ ఓ ట్రెండే. సెలబ్రిటీల నుంచి సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల వరకూ దీన్ని ఫాలో అవుతున్నారు. అంజనాదూబేకి 13 ఏళ్ల వయసులో జుట్టు నెరుపు మొదలైంది. హెయిర్‌డైతో కొన్నాళ్లు దాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేసినా… తర్వాత వాస్తవాన్ని అంగీకరించడం మొదలుపెట్టింది. గ్రేహెయిర్ బ్లాగర్‌గా మారింది. సినీతారలు నేహా ధూపియా, మాధవన్, జగపతిబాబు, సమీరారెడ్డి… వంటివారు ఈ సాల్ట్ అండ్ పెప్పర్‌లుక్‌లో కనిపిస్తూ సహజత్వాన్ని అంగీకరిస్తున్నామని చాటుతున్నారు.
కలర్ కేర్ అవసరం…
- రసాయన రంగులతో మీకేమైనా అలర్జీలు ఉన్నాయేమో ముందే గమనించుకోవాలి. చెవి వెనుక జుట్టుకి కొద్దిగా వేసి ప్యాచ్‌టెస్ట్ చేయాలి. 48 గంటల వరకూ ఎటువంటి నెగెటివ్ ఫలితాలూ లేకుంటే వాడుకోవచ్చు. అదీ తప్పని పరిస్థితుల్లో మితంగానే వాడుకోవాలి.
- ఎక్కువ రోజులు కలర్ నిలిచి ఉండాలంటే… తరచూ తలస్నానాలు చేయొద్దు. సూర్యకాంతి నుంచి జుట్టుని కాపాడటానికి స్కార్ఫ్, టోపీలను వాడండి. లేదంటే యూవీ కిరణాలు కలర్ త్వరగా పోయేలా చేయడంతో జుట్టునీ పాడు చేస్తాయి.
- తలకి రంగు వేసుకున్నాక కొన్నిరోజులు వేడినీళ్లతో స్నానం చేయకపోవడమే మేలు.
- జుట్టుకి కలరింగ్ చేసిన వారం వరకూ బ్లోడ్రెయింగ్, స్ట్రెయిటనింగ్ వంటివి చేయించొద్దు. కోల్పోయిన తేమను పొందడానికి వారానికి ఒకసారి కొబ్బరి లేదా ఆర్గాన్ నూనెతో హెయిర్ మాస్క్ వేయండి.
జాగ్రత్త మరి…
జుట్టుకి రంగువేసుకోవడం తప్పనిసరి అనుకున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి. ఎందుకంటే, వెంట్రుకల్లోకి రంగుని చొప్పించడానికి డైలలో అమోనియా, పీపీడీ, హెడ్రోజెన్ పెరాక్సెడ్ వంటి రసాయనాలను వాడతారు. ఇవి తలలో ఉండే నేచురల్ ఆయిల్స్‌ని పొడిబారేలా చేయొచ్చు. దీంతో జుట్టు రాలడం, పొడిబారడం, చిట్లడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అలానే, ఇందులోని రసాయనాలు…సున్నితమైన చర్మతత్వం కలవారిలో దురద, చర్మం ఎర్రగా మారడం, వాపు, అలర్జీ, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందిని కలిగిస్తాయి. ముఖంపై పిగ్మెంటేషన్ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. అంతేకాదు, హార్మోన్ల అసమతౌల్యత, క్యాన్సర్ వంటి వాటికీ దారితీయొచ్చని చెబుతున్నాయి పలు అధ్యయనాలు. అందుకే, తప్పనిసరైతే తప్ప డై జోలికి పోవద్దు. అలాగే తక్షణ రంగుని ఇచ్చే బ్లాక్‌హెన్నా, బ్లాక్‌కలర్ షాంపూల్లో రసాయనాలు కాస్త ఎక్కువే. కాబట్టి సల్ఫేట్లు, అమోనియా, పెరాక్సైడ్, పీపీడీ లేనివి ఎంచుకోవాలి. బదులుగా సహజమైనవీ, వెజిటెబుల్ డైలను ఎంచుకుంటే మంచిది. రంగు వేయాలనుకున్నప్పుడు కొన్నిరోజుల పాటూ తలకి ఏ ఉత్పత్తినీ వాడొద్దు. రెండు రోజుల ముందే తలస్నానం చేసి నాణ్యమైన కండిషనర్‌ని వాడాలి. అలానే, కలర్ వేసుకునే ముందు ముఖానికి, మాడుకు కూడా మాయిశ్చరైజర్ అప్లై చేసి, తర్వాత డై వేసుకోవాలి. అలానే వెంట వెంటనే కాకుండా కాస్త విరామం ఇవ్వాలి.
































