తిరుపతికి వెళ్లే ప్రయాణీకులకు దక్షిణ మధ్య రైల్వే కీలక అప్డేట్ ఇచ్చింది. తిరుపతికి మరో ఎక్స్‌ప్రెస్ అందుబాటులోకి తీసుకొచ్చింది. నడికుడి-శ్రీకాళహస్తి మార్గంలో ఈ రైలు కొనసాగనుంది.
న్యూ పిడుగురాళ్ల-శావల్యాపురం మధ్య 46 కి.మీ. దూరం నూతన రైలు మార్గాన్ని నిర్మించారు. ఈ మార్గం నుంచి తిరుపతికి రైలును నడుపుతున్నారు. సికింద్రాబాద్ నుంచి తిరుపతి మీదుగా దక్షిణాది నగరాలకు ఈ మార్గం ద్వారా అనుసంధానం ఏర్పడింది. ఇక, తిరుపతి ప్రయాణీకుల కోసం చర్లపల్లి నుంచి నంద్యాల మీదుగా ఈ రైలు కొనసాగనుంది.
తిరుపతికి వెళ్లే ప్రయాణీకుల కోసం రైల్వే మరో రైలు కేటాయించింది. సెప్టెంబర్ 9 నుండి నవంబర్ 25 వరకు నంద్యాల మీదుగా చెర్లపల్లి నుండి తిరుపతికి కొత్త వీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలు నడుస్తుంది. కొత్తగా అందుబాటులోకి వచ్చిన నడిగూడె – శ్రీకాళహస్తి మార్గంలో ఈ రైలు నడపాలని నిర్ణయించారు. ఈ మేరకు రైలు నెంబర్.. రైలు ప్రయాణ వేళలను ఖరారు చేసారు. రైలు నెం. 07013 మంగళవారం రాత్రి 9.10 గంటలకు చెర్లపల్లిలో ప్రారంభమై మరుసటి రోజు ఉదయం 5.30 గంటలకు నల్గొండ, పిడుగురాళ్ల, మార్కాపురం, గిద్దలూరులలో స్టాప్‌లతో నంద్యాలకు చేరుకుంటుంది. ఈ రైలు ఉదయం 5.35 గంటలకు నంద్యాల నుండి బయలుదేరి కోయిలకుంట్ల మీదుగా తిరుపతికి చేరుతుంది.
అదే విధంగా తిరుగు ప్రయాణంలో, రైలు 07014 బుధవారం సాయంత్రం 4.40 గంటలకు తిరుపతిలో బయలుదేరి, అదే రోజు రాత్రి 10.25 గంటలకు నంద్యాలకు చేరుకుని, గురువారం ఉదయం 8 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది. ఈ రైలు ద్వారా ఉమ్మడి కర్నూలు వాసులకు వెసులుబాటు కలగనుంది.
అయితే, ప్రస్తుతం ఈ రైలు వీక్లీ ఎక్స్ ప్రెస్ గా కొనసాగిస్తున్నా… మూడు నెలల పాటు నడవనుంది. ప్రయాణీకుల రద్దీ.. ఆక్యుపెన్సీ ఆధారంగా మరి కొంత కాలం కొనసాగించే అవకాశం ఉంది. అయితే… ఆశించిన స్థాయిలో రద్దీ ఉంటే ఈ రైలునే రెగ్యులర్ సర్వీసుగా మార్చే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే మార్గంలో తిరుపతికి వందేభారత్ నడపాలనే డిమాండ్ పైన రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. త్వరలోనే నిర్ణయం వెల్లడించే అవకాశం కనిపిస్తోంది.
































