రేషన్ సరఫరాలో కీలక మార్పులు, ఇక నెలంతా – వచ్చే నెల నుంచి కొత్తగా

పీ ప్రభుత్వం రేషన్ సరఫరా పై కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ దుకాణాల ద్వారా సరుకులు పంపిణీ కూటమి ప్రభుత్వం తిరిగి ప్రారంభించింది. అదే సమయంలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కొనసాగుతోంది.


ఇప్పటి వరకు రేషన్ దుకాణాల ద్వారా నెలలో తొలి 15 రోజుల్లోనే సరుకులు తీసుకోవాల్సి ఉంది. ఇప్పుడు ఈ కాల పరిమితిని సడలిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా వచ్చే నెల నుంచి రేషన్ లో గోధుమ పిండి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

రేషన్ లబ్దిదారులకు అనుకూలంగా ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. రేషన్ దుకాణాల పని వేళల పైన మంత్రి మనోహర్ కీలక ప్రకటన చేసారు. ఉచిత బియ్యం, ఇతర సరుకులను లబ్ధిదారులు ఇకపై ఎప్పుడైనా తీసుకునేలా వెసులుబాటు కలిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇందు కోసం రేషన్‌ షాపులు నెల మొత్తం రేషన్ దుకాణాలు తెరిచి ఉంచేలా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. 15 రోజులలోపే తీసుకోవాలనే కాలపరిమితిని తీసేస్తున్నట్లు చెప్పారు. రేషన్‌ దుకాణాలు 365 రోజులూ తెరిచే ఉంటాయని, ప్రజలు తీరిక ఉన్న సమయం లోనో లేదా అవసరమైన వేళ సరుకులు తెచ్చుకునే వెసులుబాటు కల్పించనున్నట్లు చెప్పారు. ఇక నుంచి నెలలో ఎప్పుడైనా రేషన్‌ తీసుకునేలా మార్పులు చేసినట్లు వెల్లడించారు.

ఇప్పటి వరకు నెలలో 15 రోజులలోపు మాత్రమే రేషన్‌ తీసుకునే అవకాశం ఉండేదని, ఆ సమయంలో తీసుకోనివారు తర్వాత తీసుకునే అవకాశం లేక.. ఆ నెల సరుకులు కోల్పోయే పరిస్థితి తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. కందిపప్పు, వంట నూనె సబ్సిడీపై అవసరమున్న ప్రాంతాల్లో ప్రస్తుతం అందిస్తున్నామని తెలిపారు. లబ్ధిదారుల అభ్యర్థన మేరకు వచ్చే నెల నుంచి రాగులతో పాటు గోధుమ పిండిని కూడా సబ్సిడీపై ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని వెల్లడించారు.

సెప్టెంబరు 15 లోగా రాష్ట్రంలోని 1.46 కోట్ల మంది లబ్ధిదారులకు స్మార్ట్‌ కార్డులను ఇంటింటికీ వెళ్లి అందించే కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని స్పష్టం చేసారు. రాష్ట్రంలోని 29వేల రేషన్‌ దుకాణాలను నెలంతా తెరచి ఉంచటం వల్ల డీలర్లకు కూడా ఆదాయం పెంచే ఆలోచన చేస్తున్నట్లు మనోహర్‌ చెప్పారు. రేషన్‌ విషయంలో సమస్యలు, సందేహాలున్నా 1967 టోల్‌ ఫ్రీ నంబర్‌కు కాల్‌చేసి సహాయం పొందవచ్చని సూచించారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.