iBomma కుప్పకూలుతుందా..? హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల సూపర్ ఆపరేషన్

విడుదలైన కొద్ది గంటల్లోనే సినిమాలను అక్రమంగా అప్‌లోడ్ చేసి ప్రసారం చేస్తున్న వెబ్‌సైట్లపై హైదరాబాద్‌ సైబర్ క్రైమ్ పోలీసులు కేసులు నమోదు చేశారు.


ముఖ్యంగా iBomma, Bappam వంటి సైట్లు, వాటికి సంబంధించిన మరో 65 మిర్రర్ డొమైన్లు ఇప్పుడు విచారణలో ఉన్నాయి. ఈ కేసులు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదు అయ్యాయి. పైరసీ కారణంగా పరిశ్రమకు భారీ నష్టాలు వాటిల్లుతున్నాయని ఛాంబర్ స్పష్టంగా తెలిపింది.

పైరసీ వెబ్‌సైట్లు థియేట్రికల్, ఓటీటీలో విడుదలైన సినిమాలను గంటల్లోపే హెచ్‌డీ క్వాలిటీతో అప్‌లోడ్ చేస్తున్నాయి. ఇటీవల విడుదలైన తండెల్ సినిమా కూడా ఇలా పైరసీకి గురై, భారీ నష్టాలను చవిచూసింది. TFCC వెల్లడించిన ప్రకారం, ఈ సమస్య మరింత తీవ్రమైంది. కారణం – పైరసీ సైట్లు నిర్మాతలకు నేరుగా బెదిరింపులు పంపించడం. “కోల్పోయే దేమీ లేని వ్యక్తి కంటే ప్రమాదకరుడు ఎవరూ ఉండరు” అనే సందేశం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, పలువురు సినీ నిర్మాతలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

ఈ నెట్‌వర్క్ తరచూ తమ డొమైన్‌లు మార్చుకుంటూ, మిర్రర్ సైట్ల ద్వారా పనిచేస్తోందని దర్యాప్తు అధికారులు తెలిపారు. ముఖ్యంగా క్లౌడ్ఫ్లేర్ అనే కంటెంట్ డెలివరీ నెట్‌వర్క్‌ను వాడుతూ సర్వర్ల అసలు గుర్తింపును దాచేస్తున్నారని తెలిపారు. దీంతో అప్‌లోడ్ చేసే వ్యక్తులు పూర్తిగా అజ్ఞాతంలో ఉంటున్నారని, ప్రస్తుతం 95% పైరసీ సైట్లు, iBomma సహా, క్లౌడ్ఫ్లేర్ సపోర్ట్‌తోనే నడుస్తున్నాయని అధికారులు గుర్తించారు.

ఈ అజ్ఞాత రక్షణ కారణంగా సైబర్ క్రైమ్ పోలీసులు వెబ్‌సైట్లకన్నా వాటి వెనుక ఉన్న అసలు నిర్వాహకులను గుర్తించడంపైనే దృష్టి పెట్టారు. అనుమానిత కార్యాలయాలపై దాడులు కూడా కొనసాగుతున్నాయి. TFCC అంచనా ప్రకారం, 2024లో ఒక్క సంవత్సరంలోనే తెలుగు సినీ పరిశ్రమకు సుమారు ₹3,700 కోట్ల నష్టం పైరసీ వల్ల వాటిల్లింది. అధికారులు ఈ డిజిటల్ దోపిడీని పూర్తిగా ఆపేసే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.