దేశవ్యాప్తంగా పెట్రోల్ పంపుల్లో 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్(E20) విక్రయాలను సవాల్ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం(PIL)ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది.
ఈ కేసులో న్యాయస్థానం జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ సురక్షితం కాదంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో చర్చ జరగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో E20 పెట్రోల్ వాడకాన్ని సవాల్ చేస్తూ న్యాయవాది అక్షయ్ మల్హోత్రా దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. వినియోగదారులకు ఇథనాల్-రహిత పెట్రోల్‌ను ప్రత్యామ్నాయంగా అందించాలని, అలాగే పంపులపై స్పష్టమైన లేబులింగ్ ఉండాలని పిటిషనర్లు చేసి డిమాండ్లను కోర్టు తిరస్కరించింది.
పిటిషనర్ల వాదనలో కీలకాంశాలు:
పిటిషనర్లు తమ వాదనలో ప్రధానంగా మూడు అంశాలను లేవనెత్తారు:
వాహనాలకు నష్టం: దేశవ్యాప్తంగా లక్షలాది మంది వాహనదారులు, ముఖ్యంగా పాత మోడల్ కలిగి ఉన్నవారు తమ ఇంజన్లకు సరిపడని E20 పెట్రోల్ ఇంధనాన్ని ఉపయోగించమని బలవంతం చేయబడుతున్నారని ఆరోపించారు. E20 పెట్రోల్ వల్ల మెకానికల్ డీగ్రేడేషన్, ఇంజిన్ పనితీరు క్షీణించడం వంటి సమస్యలు వస్తున్నాయని పేర్కొన్నారు.
వినియోగదారుల హక్కులు: వినియోగదారులకు సరైన ఎంపిక హక్కు ఉండాలని, పెట్రోల్ పంపుల్లో ఇథనాల్-రహిత పెట్రోల్ కూడా అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. అలాగే E20 పెట్రోల్ వల్ల కలిగే ప్రభావాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు.
పారదర్శకత లేకపోవడం: E20 పెట్రోల్ విక్రయాలపై సరైన నోటీసులు లేదా ప్రకటనలు జారీ చేయకుండానే దీనిని దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టారని, ఇది ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని వాదించారు.
కేంద్రం, అటార్నీ జనరల్ ప్రతివాదన
ఈ పిటిషన్‌ను కేంద్ర ప్రభుత్వం తరపున అటార్నీ జనరల్ బలంగా వ్యతిరేకించారు. ఆయన చేసిన కీలక వాదనలు ఇలా ఉన్నాయి. ప్రభుత్వం E20 పాలసీని అన్ని కోణాల నుంచి పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకుంది. ఇది కేవలం ఇంధనానికి సంబంధించిన అంశం కాదు, ఇది దేశీయ ఇంధన భద్రత, ఆర్థిక ప్రయోజనాలతో ముడిపడి ఉంది.ఇథనాల్‌ను చెరుకు నుంచి తయారు చేస్తారు కాబట్టి, ఇథనాల్‌ను పెట్రోల్‌లో కలపడం వల్ల దేశంలోని లక్షలాది మంది చెరుకు రైతులకు నేరుగా ఆర్థిక ప్రయోజనం లభిస్తుంది. ఈ వ్యవస్థను రద్దు చేస్తే రైతులు తీవ్రంగా నష్టపోతారు.భారతదేశంలో ఏ పెట్రోల్ ఉపయోగించాలో బయటి నుంచి ఎవరైనా వచ్చి నిర్ణయిస్తారా?” అంటూ ఆయన పిటిషనర్ల ఉద్దేశాన్ని అటార్నీ జనరల్ ప్రశ్నించారు. ఇది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం అని ఆయన స్పష్టం చేశారు.
సుప్రీంకోర్టు తుది నిర్ణయం
ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం.. ప్రధాన న్యాయమూర్తి సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ విషయంలో కోర్టు జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. ఇది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం కాబట్టి దీనిపై ప్రత్యేక ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం లేదని కోర్టు పేర్కొంది. ఈ తీర్పుతో దేశంతో ఇథనాల్ కలిపిన E20 పెట్రోల్ విక్రయాలు యథావిధిగా కొనసాగుతాయి.
































