అమెరికాలో ఉద్యోగం పోతే పోనీయ్.. ఇండియాకొచ్చేస్తాం..

మెరికాలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయ నిపుణులు ప్రస్తుతం తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు. ముఖ్యంగా ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న కఠినమైన వలస విధానాలు, వీసా నిబంధనలు వారి భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.


ఉద్యోగం కోల్పోతే స్వదేశానికి తిరిగి వెళ్లాలనే భావన వారిలో పెరుగుతోంది.

ఉద్యోగ భద్రతపై ఆందోళన పెరగడానికి కారణాలు

ట్రంప్ పరిపాలనలో హెచ్1బీ (H-1B) వీసా నిబంధనలు కఠినతరం కావడమే ఈ ఆందోళనకు ప్రధాన కారణం. గతంలో లాటరీ పద్ధతిలో వీసాలు కేటాయించగా, ఇప్పుడు వేతనాల ఆధారంగా వీసా ఎంపిక విధానాన్ని అమలు చేస్తున్నారు. దీని వల్ల అధిక వేతనం పొందే వారికి లాభం చేకూరుతుంది కానీ, కొత్తగా ఉద్యోగంలో చేరిన యువతకు అవకాశాలు తగ్గుతున్నాయి. ఈ విధాన మార్పుల వల్ల తమకు నష్టం జరుగుతుందని 69% మంది భారతీయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అమెరికా కంపెనీలు తమ దేశ నిపుణులకు లాభం చేకూర్చే ఉద్దేశంతో ఈ విధానాలు తీసుకుంటున్నాయని 63% మంది యూఎస్ నిపుణులు భావిస్తున్నారు. కానీ భారతీయులకు మాత్రం ఈ విధానాలు భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేస్తున్నాయి.

ఉద్యోగం పోతే స్వదేశానికి తిరుగు పయనం

ఒక సర్వే ప్రకారం ఉద్యోగం కోల్పోతే 45% మంది భారతీయులు భారతదేశానికి తిరిగి వెళ్తామని పేర్కొన్నారు. దీనికి ప్రధాన కారణాలు.. ఉద్యోగ భద్రత లేకపోవడం వల్ల జీతాలు తగ్గే ప్రమాదం ఉందని భయం. అధిక ఒత్తిడి, వీసా భయాలు వారి జీవన నాణ్యతను దెబ్బతీస్తున్నాయి. కుటుంబానికి దూరంగా ఉండటం, సాంస్కృతిక వ్యత్యాసాల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగం కోల్పోతే కొత్త అవకాశాలు దొరకవని భయం వెంటాడుతోంది.. ఈ కారణాల వల్ల 26% మంది ఇతర దేశాలకు వెళ్లాలని భావిస్తుండగా.. 29% మంది ఎలాంటి నిర్ణయం తీసుకోలేని సందిగ్ధంలో ఉన్నారు.

– వీసా భయం, బహిష్కరణ ముప్పు

వీసా నిబంధనల ప్రకారం.. ఒక ఉద్యోగం పోతే 60 రోజుల్లోపు కొత్త ఉద్యోగం వెతుక్కోవాలి. లేకపోతే అమెరికాను విడిచి వెళ్లాల్సి వస్తుంది. ఈ గడువు చాలా మందికి మానసిక ఒత్తిడిని కలిగిస్తోంది. కొంతమందికి ఈ గ్రేస్ పీరియడ్ ముగిసేలోపే బహిష్కరణ నోటీసులు వస్తున్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఉద్యోగం కోల్పోయినవారిపై దీర్ఘకాలిక నిషేధం విధించే అవకాశం ఉందని ప్రతి ఆరుగురిలో ఒకరు భయపడుతున్నారు.

అమెరికాలో తమ భవిష్యత్తు అనిశ్చితంగా మారడంతో ఈ నిపుణులు తమ స్వదేశమైన భారతదేశం, ఇతర దేశాలలో అవకాశాలను అన్వేషించే అవకాశం ఉంది. దీని ద్వారా భారత్ వంటి దేశాలు తమ నైపుణ్యంతో కూడిన నిపుణులను తిరిగి ఆకర్షించి, వారి నైపుణ్యాలను దేశాభివృద్ధికి ఉపయోగించుకోవచ్చు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.