APPSC: త్వరలో 20 ఉద్యోగ నోటిఫికేషన్లు

వివిధ శాఖల్లో ఖాళీల భర్తీకి త్వరలో 20 నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. వీటిద్వారా సుమారు 80 పోస్టులు భర్తీ చేస్తామని ఏపీపీఎస్సీ కార్యదర్శి పి.రాజాబాబు వెల్లడించారు. ఈ నెలాఖరుకే ఈ నోటిఫికేషన్లు జారీ అవుతాయని తెలిపారు. సోమవారం విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో.. అటవీ శాఖలో ఉద్యోగ నోటిఫికేషన్ల స్ర్కీనింగ్‌ పరీక్షలపై ఆయన విలేకరులతో మాట్లాడారు. అటవీ శాఖలో ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ బీట్‌ ఆఫీసర్‌ పోస్టులు 691, ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ పోస్టులు 100 భర్తీకి ఇటీవల నోటిఫికేషన్లు జారీ చేశామన్నారు. ఈ నెల 7న ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో స్ర్కీనింగ్‌ పరీక్షలు జరుగుతాయని, ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 287 కేంద్రాలు ఏర్పాటు చేశామని వివరించారు. అభ్యర్థులు ఓఎంఆర్‌ షీట్లపై వివరాలను పొరపాట్లు లేకుండా నమోదు చేయాలన్నారు. ఒకసారి సమాధానం రాసి, దాన్ని వైట్‌నర్‌ లేదా ఇతర మార్గాల్లో చెరిపివేస్తే, ఆ పేపర్లను ఇన్‌వాలిడ్‌గా పరిగణిస్తారని తెలిపారు. ప్రతి మూడు తప్పులకు ఒక మైనస్‌ మార్కు ఉంటుందన్నారు. కాగా, స్పోర్ట్స్‌ కోటా అభ్యర్థుల జాబితాలు శాప్‌ నుంచి రానందున గ్రూప్‌-1, గ్రూప్‌-2 పరీక్షల ఫలితాలు నిలిచిపోయాయని తెలిపారు. స్పోర్ట్స్‌ కోటా మినహా మిగిలిన పరీక్షల ఫలితాల ప్రక్రియ మొత్తం పూర్తయిందన్నారు. గ్రూప్‌-2లో 1634 మంది అభ్యర్థుల కంటిచూపు, 24 మంది అభ్యర్థుల వినికిడి రిపోర్టులు అందాల్సి ఉందన్నారు. గ్రూప్‌-1, 2 ఫలితాలపై సోషల్‌ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని అభ్యర్థులను కోరారు. కాగా, త్వరలో విడుదల చేసే నోటిఫికేషన్లలో తక్కువ పోస్టులున్నందున అన్నింటికీ కలిపి ఒకేసారి పరీక్షలు నిర్వహించాలని భావిస్తోంది.


👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.