తలనొప్పి: సాధారణంగా ఒత్తిడి, నిద్రలేమి, లేదా అలసట వల్ల తలనొప్పి వస్తుంది. కానీ తరచుగా వచ్చే లేదా తీవ్రమైన తలనొప్పి మైగ్రేన్లు, అధిక రక్తపోటు లేదా నరాల సమస్యలకు సూచన కావచ్చు.తలనొప్పితో పాటు వాంతులు, కళ్లు తిరగడం, లేదా కాంతిని చూడలేకపోవడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
ఛాతీ నొప్పి: ఛాతీ నొప్పిని చాలామంది గ్యాస్ లేదా అజీర్ణంగా పొరబడుతుంటారు. అయితే నిరంతరంగా ఉండే ఛాతీ నొప్పి లేదా ఒత్తిడి గుండెపోటు లేదా గుండె రక్తనాళాల వ్యాధికి ప్రారంభ లక్షణం కావచ్చు. నొప్పి ఎడమ చేయి, భుజం లేదా దవడ వరకు వ్యాపిస్తే ఇది గుండె సమస్యలకు తీవ్రమైన సంకేతం.
కడుపు, నడుము నొప్పి: మహిళల్లో తరచుగా వచ్చే కడుపు లేదా నడుము నొప్పి మూత్రపిండాల్లో రాళ్లు, అల్సర్, కాలేయ వ్యాధులు లేదా పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ వంటి సమస్యలను సూచించవచ్చు. ఉబ్బరం, ఆకలి లేకపోవడం లేదా మూత్రవిసర్జన సమయంలో మంట ఉంటే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిది.
కీళ్ల-ఎముకల నొప్పి: కీళ్లలో లేదా ఎముకలలో నిరంతరంగా నొప్పి ఉంటే అది ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్ లేదా విటమిన్ డి, కాల్షియం లోపానికి లక్షణం కావచ్చు. రుతువిరతి తర్వాత మహిళల్లో ఈ సమస్య సాధారణం. కీళ్లు ఎప్పుడూ బిగుసుకుపోయినట్టుగా లేదా ఒత్తిడిగా అనిపిస్తే తక్షణమే వైద్య సలహా తీసుకోవాలి.
కళ్ళు – వెన్నునొప్పి: కళ్లలో నొప్పి లేదా మంటగా అనిపిస్తే అది గ్లాకోమా లేదా కంటి బలహీనతకు సంకేతం కావచ్చు. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వెన్నునొప్పి వస్తుంది. కానీ విశ్రాంతి తర్వాత కూడా నొప్పి తగ్గకపోతే వెన్నెముక లేదా ఎముకల బలహీనతకు సూచన కావచ్చు.
































